వైభవంగా రొళ్ల లక్ష్మీనృసింహస్వామి రథోత్సవం
రొళ్ల: మండల కేంద్రంలో శుక్రవారం లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మరథోత్సవం వైభవంగా సాగింది. ఉదయాన్నే స్వామి మూలవిరాట్‌ను ప్రత్యేకంగా అలంకరించి వేదపండితులు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణ ముందు భాగాన ఉన్న రథాన్ని వివిధ రకాల పూలతో అలంకరించారు. రథం ముందు భాగాన వేదపండితులు శాంతి, నవగ్రహ హోమం, యోగీశ్వరారాధన, గణపతి పూజ, బలిహరణ తదితర పూజలు చేశారు. తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ విగ్రహాలను ప్రధాన ఆలయం నుంచి మేళతాళాలతో ఆంజనేయస్వామి ఆలయం వరకు ఊరేగించారు. అనంతరం అర్చకులు ఉత్సవ విగ్రహాలను రథంలో ఉంచి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులు రథంపైకి అరటి పండ్లు, పూలు, తమలపాకులు, బొరుగులు విసిరి మొక్కులు తీర్చుకున్నారు. గోవింద నామ స్మరణతో రథాన్ని ఆలయ ప్రాంగణం నుంచి ఆంజనేయస్వామి ఆలయం వరకు లాగారు. భక్తులకు దాతల సహకారంతో మూడు చోట్ల అన్నదానం చేశారు. బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మడకశిర సీఐ రాజ్‌కుమార్ ఎస్‌ఐ వీరాంజనేయులు, అమరాపురం ఎస్‌ఐ ఇషాక్‌బాషాతో కలిసి బందోబస్తు ఏర్పాటు చేశారు.
నేడు రొళ్లకొండ పై దివ్యజ్యోతి దర్శనం..
లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం రొళ్లకొండ పై భాగాన వెలసిన ఉగ్రనరసింహస్వామి ఆలయంలో దివ్యజ్యోతి దర్శనం, వసంతోత్సవం, భక్తులతో ధాన్యం సేకరణ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు.
వైభవంగా రొళ్ల లక్ష్మీనృసింహస్వామి రథోత్సవం


