
ఆదిశక్తికి ప్రతిరూపమే మహిళ
● ఎస్పీ రత్న
హిందూపురం: ఆదిశక్తికి ప్రతిరూపమే మహిళ అని ఎస్పీ రత్న పేర్కొన్నారు. హిందూపురం డీఎస్పీ మహేష్ ఆధ్వర్యంలో తూమకుంట సమీపంలోని ఓ ఫంక్షన్ హాలులో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఎస్పీతోపాటు హిందూపురం జిల్లా అదనపు జూనియర్ సివిల్ జడ్జి లలితలక్ష్మి, మెప్మా పీడీ విజయలక్ష్మి, సీడీపీఓ శాంతి హాజరయ్యారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం ప్రభుత్వం త్వరలో శక్తి టీఎం ఏర్పాటు చేయబోతోందన్నారు. శక్తి యాప్ కూడా ఏర్పాటు చేశామని ఆన్‌లైన్ శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఏ ఆపద వచ్చినా సెల్‌ఫోన్ మూడుసార్లు ఊపినా లేదా ఎస్‌ఓఎస్ బటన్ నొక్కినా వెంటనే రెస్క్యూ టీం ఘటనస్థలికి చేరుకుని రక్షిస్తుందన్నారు. హిందూపురం అదనపు జూనియర్ సివిల్ జడ్జి లలితలక్ష్మి మాట్లాడుతూ తల్లిదండ్రులు ఆడపిల్లలను దేన్నయినా ధైర్యంగా ఎదుర్కొనేలా పెంచాలన్నారు. మహిళల రక్షణ కోసం అనేక చట్టాలున్నాయని, వాటిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. డాక్టర్లు జీవన, షమ్మిలా, సీఐలు జనార్దన్, ఆంజనేయులు, కరీం, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.