
రైలు కిందపడి లారీ క్లీనర్ ఆత్మహత్య
ధర్మవరం అర్బన్: అనారోగ్యంతో రైలు కిందపడి లారీ క్లీనర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణంలో జరిగింది. హిందూపురం జీఆర్‌పీ హెడ్ కానిస్టేబుల్ ఎర్రిస్వామి తెలిపిన వివరాలు.. పట్టణంలోని కేతిరెడ్డికాలనీలో నివసిస్తున్న అబ్దుల్ ఖాదర్‌వలి కుమారుడు షెక్షావలి(24) లారీ క్లీనర్‌గా పనిచేసేవాడు. నాలుగేళ్లుగా అల్సర్‌తోపాటు గడ్డలు ఉండటంతో తీవ్రనొప్పితో బాధపడుతుండేవాడు. తల్లిదండ్రులు పలు ఆసుపత్రుల్లో వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది. నొప్పి ఎక్కువగా ఉండటంతో వారం రోజులుగా తాను రైలు కింద పడి చనిపోతానంటూ తల్లిదండ్రులతో చెబుతున్నాడు. ఈక్రమంలో గురువారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. నాందేడ్ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ సమాచారం మేరకు హిందూపురం జీఆర్‌పీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్‌పీ హెడ్‌కానిస్టేబుల్ ఎర్రిస్వామి తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
పరిగి: శాసనకోటలో కేశవయ్య(30) అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ రంగడుయాదవ్ తెలిపిన వివరాలు.. సోమందేపల్లి మండలం నడింపల్లికి చెందిన కేశవయ్యకు శాసనకోట గ్రామానికి చెందిన స్నుతితో 2021లో వివాహమైంది. వీరికి విక్రాంత్ అనే మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. వృత్తి రీత్యా కేశవయ్య బెంగళూరులో ఉంటున్నాడు. అయితే భార్య స్నుతి, ఆమె తల్లి పాపులమ్మ, బావమరిది సురేష్ తరచూ కేశవయ్యతో గొడవ పడేవారు. శాసనకోటలో కాపురముండాలని, సంపాదించినదంతా తమకే ఇవ్వాలని వేధించేవారు. ఈక్రమంలో గత బుధవారం అతడు శాసనకోటకు వచ్చాడు. కుటుంబ సభ్యులంతా లేపాక్షి మండలంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న అతడు ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు స్నుతి, పాపులమ్మ, సురేష్‌పై కేసు నమోదు చేసనట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
బేల్దారి బలవన్మరణం
పెనుకొండ: పెనుకొండ నగర పంచాయతీలోని తిమ్మాపురంలో బేల్దారి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు అందించిన సమాచారం.. గ్రామానికి చెందిన నంజుండ (33) బేల్దారి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే తన భార్య సీపీఎం నేత రమేష్‌తో సన్నిహితంగా ఉంటోందని మనోవేదనకు గురయ్యాడు. ఈక్రమంలో బుధవారం అర్ధరాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరుడు ముత్యాలు ఫిర్యాదు మేరకు నాగమణితోపాటు రమేష్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నాడు.
పట్టపగలే ఇంట్లో చోరీ
తాడిపత్రి: సజ్జలదిన్నె గ్రామంలో చాంద్‌బాషా అనే వ్యక్తి ఇంటిలో గురువారం పట్టపగలే చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. చాంద్‌బాషా, బీబీ దంపతులు సజ్జలదిన్నె పారిశ్రామిక వాడలోని ఓ బండల పాలిష్ పరిశ్రమలో కూలీలుగా పని చేస్తున్నారు. ఉదయం వారు పనులకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో ఉన్న 2 తులాల బంగారు ఆభరణాలు, జత వెండి గొలుసులు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వినూత్నంగా వివాహ వేడుక
● అతిథులకు మొక్కల పంపిణీ
పావగడ: తాలూకాలోని భీమనకుంటె గ్రామం సముదాయ భవనంలో తాండ్ర కల్పన, వి గోకుల్ వివాహ వేడుక వినూత్నంగా జరిగింది. ఈ సందర్భంగా నూతన వధూవరులు వివాహానికి వచ్చిన సుమారు 500 మంది అతిథులకు జామ, దానిమ్మ, నేరేడు, శ్రీగంధం తదితర మొక్కలను అందించి ప్రతి ఒక్కరూ చెట్ల పెంపకంతో పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. ఈ వేడుకల్లో సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయ మూర్తి హెచ్‌ఎల్ దత్తు, భార్య గాయత్రి, విశ్రాంత విశేష జిల్లా కలెక్టర్ దొడ్డహళ్లి రామాంజనేయులు, భార్య శారద తదితర ప్రముఖులు మొక్కలను పంపిణీ చేసిన నూతన వధూవరులను ఆశీర్వదించారు. మొక్కలపై వారికి ఉన్న ఎనలేని మక్కువను ప్రశంసించారు.

రైలు కిందపడి లారీ క్లీనర్ ఆత్మహత్య

రైలు కిందపడి లారీ క్లీనర్ ఆత్మహత్య