
రొళ్ల: మండలంలోని తిరుమలదేవరపల్లికి చెందిన భారతి, బాలకృష్ణ దంపతుల రెండో కుమార్తె ఖుషీగౌడు నటనలో రాణిస్తోంది. ప్రేమభిక్షం, ఆగస్టు 6 రాత్రి, రుద్రాక్షపురం వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఆర్‌కే గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘త్రిష’ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. తమ గ్రామానికి చెందిన యువతి సినిమాల్లో నటిస్తుండడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు
ఖుషీగౌడు తల్లిదండ్రులది మధ్య తరగతి కుటుంబం. ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామంలోనే కొనసాగింది. తండ్రి వ్యాపార రీత్యా కర్ణాటక రాష్ట్రం తుమకూరు పట్టణంలో స్థిరపడ్డారు. ఖుషీగౌడు చిన్న వయసులోనే నటనపై ఆసక్తి పెంచుకుంది. పాఠశాల, కళాశాల స్థాయిలో నాటికల్లో విభిన్న పాత్రలు వేసి అందరి మన్ననలు పొందింది. కుమార్తెకు నటనపై ఉన్న మక్కువను గుర్తించిన తల్లిదండ్రులు ప్రోత్సహించారు. దీంతో ఆమె మరింత ఉత్సాహంగా ముందుకు సాగింది. 2020 మిస్‌టీన్ కర్ణాటక, 2021 మిస్ కర్ణాటక అందాల పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. న్యాయ నిర్ణేతలను మెప్పించి టైటిళ్లను సొంతం చేసుకుంది. దీంతో ఆమెకు సినిమాల్లో అవకాశాలొచ్చాయి. కన్నడలో ఇటీవల అహుతాల సూర్య తెరకెక్కించిన మాస్టర్ ప్లాన్ చిత్రంలో నటించింది.
హీరోయిన్‌గా ఛాన్స్..
ఖుషీగౌడు చేసిన నాటికలు, వివిధ ప్రదర్శనలను ఆన్‌లైన్‌లో చూసిన ప్రముఖ దర్శకుడు ఆర్‌కే గాంధీ తను తెరకెక్కిస్తున్న ‘త్రిష’ చిత్రంలో హీరోయిన్‌గా ఆమెకు ఛాన్స్ ఇచ్చారు. భక్తిభావానికి ప్రతీకగా చిత్రం ఉండనున్నట్లు తెలిసింది. స్నేహాలయ క్రియేషన్స్ బ్యానర్‌పై తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుగుతోంది. చిత్రంలో శివుడి పాత్రలో ప్రముఖ నటుడు సుమన్ నటిస్తుండడం గమనార్హం. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవంలో ప్రముఖులతో కలిసి ఖుషీగౌడ్ పాల్గొంది. నాలుగు రోజుల పాటు అక్కడి మియాపుర్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ కూడా చేపట్టారు. త్వరలో రాష్ట్రంలోని ప్రముఖ ప్రదేశాలతో పాటు కర్ణాటక రాష్ట్రం హొసకోట తాలూకా భక్తరహళ్లి, చిక్కబళ్లాపుర తాలూకా అజ్జవార, ముళబాగిలు తాలూకా విరుపాక్ష దేవాలయం తదితర ప్రాంతాల్లో కూడా షూటింగ్ జరగనుందని సమాచారం. వచ్చే ఏడాది మహాశివరాత్రి నాటికి ఈ సినిమా వెండి తెరపై విడుదల కానున్నట్లు తెలిసింది.
నటనలో రాణిస్తున్న రొళ్ల మండలవాసి ఖుషీగౌడు
తల్లిదండ్రుల ప్రోత్సాహం
2021 మిస్ కర్ణాటక అందాల పోటీల్లో
టైటిల్ విజేత
ఆర్‌కే గాంధీ ‘త్రిష’ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్
బిడ్డలో నైపుణ్యాన్ని ఆ తల్లిదండ్రులు
గుర్తించారు. వెన్నుతట్టి ప్రోత్సహించారు. వారి నమ్మకాన్ని ఆ కుమార్తె వమ్ము చేయలేదు. ఆసక్తి పెంచుకున్న రంగంలో కష్టపడింది. అంచెలంచెలుగా ఎదిగింది. హీరోయిన్ స్థాయికి చేరింది. ఏకకాలంలో రెండు భాషల్లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. ఖుషీగౌడు స్ఫూర్తిదాయక ప్రస్థానమిది.
తల్లిదండ్రుల సహకారం మరువలేనిది
చిన్న వయసులోనే నాలో ఉండే నైపుణ్యాన్ని తల్లిదండ్రులు గుర్తించారు. వెన్నంటే ప్రోత్సహించేవారు. ప్రాథమిక దశలో ఎంతో చురుగ్గా ఉండేదాన్ని. ఐదారేళ్లున్నప్పుడు నృత్యాలు, విభిన్న ఆటల పోటీల్లో పాల్గొనేదాన్ని. అందులో భాగంగానే 2020లో కర్ణాటక మిస్‌టీన్, 2021 మిస్ కర్ణాటక అందాల పోటీల్లో ప్రతిభ కనబరచి టైటిళ్లు కూడా సొంతం చేసుకున్నా. నా నటనా కౌశలాన్ని గుర్తించిన ప్రముఖ దర్శకుడు ఆర్‌కే గాంధీ హీరోయిన్‌గా తన చిత్రంలో అవకాశం కల్పించారు. తెలుగు, కన్నడ భాషలో ఏకకాలంలో తెరకెక్కుతున్న ‘త్రిష’ మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్నా. హైదరాబాద్‌లో షూటింగ్ కూడా ప్రారంభమైంది. తల్లిదండ్రుల సహకారంతోనే ఇదంతా సాధ్యమైంది.
– ఖుషీగౌడు

మిస్ కర్ణాటక అందాల పోటీల టైటిల్‌తో ఖుషీగౌడు (ఫైల్)