నాటికలో ఓ ఘట్టం
ప్రశాంతి నిలయం: సత్యం,ధర్మం,శాంతి, ప్రేమలు కలగలిపి మానవాళికి సత్యసాయి సన్మార్గ బోధన చేశారని బాలవికాస్ చిన్నారులు, సత్యసాయి యూత్ తమ నాటిక ద్వారా తెలియజేశారు. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన పార్వతీపురం మన్యం సత్యసాయి భక్తులు ఆదివారం సాయంత్రం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ‘సాయి బాట–రాచ బాట’ పేరున సాగిన నృత్య నాటిక అలరించింది. సత్యసాయి బాలవికాస్ విద్యావిధానం ద్వారా సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, క్రమశిక్షణను నేర్పుతూ బంగారు భవిష్యత్తును అందిస్తున్న తీరును చక్కగా వివరించారు. సత్యసాయి వేషధారణలో ఓ విద్యార్థి ఆకట్టుకున్నాడు. అనంతరం కళాకారులు సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడు నేతాజీ నాయుడు తమ జిల్లాలో జరుగుతున్న సత్యసాయి సేవలను వివరించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో వ్రతాలు ఆచరించారు.
నృత్యంతో అలరిస్తున్న విద్యార్థులు
సత్యసాయి వేషధారణలో ఆకట్టుకున్న చిన్నారి


