● పెనుకొండలోని మడకశిర రహదారి ప్రాంతంలో నివాసం ఉంటున్న బేల్దారి నరేష్ నాలుగు రోజుల క్రితం పని నిమిత్తం వెళ్లారు.అతని భార్య కూలి పనుల కోసం వెళ్లింది. ఈ క్రమంలో దొంగలు ఆ ఇంటి తాళాలు పగులకొట్టి లోపలికి చొరబడ్డారు. బీరువా లోని 15 తులాల బంగారం, రూ. 40 వేల నగదు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
● పుట్టపర్తి పట్టణంలోని జానకీరామయ్య కల్యాణ మండపం సమీపంలో గౌసియా అనే మహిళ చిల్లర దుకాణం నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఓ గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి ఆమె దుకాణంలో కూల్ డ్రింక్ కొనుగోలు చేశాడు. స్వీట్ కావాలని అడగడంతో బాక్స్‌లో నుంచి ఇచ్చేందుకు ఆమె పైకి లేచింది. ఈ క్రమంలో సదరు వ్యక్తి ఆమె మెడలోని 3 తులాల బంగారు గొలుసు లాక్కొని పారిపోయాడు.
● కదిరి పట్టణం అడపాల వీధిలో విశ్రాంత ఉపాధ్యాయుడు ప్రసాద్‌కు ఓ ఆపరేషన్ నిమిత్తం కుటుంబమంతా వారం క్రితం బెంగళూరు వెళ్లింది. వారి ఇంటి పక్కన ఉంటున్న చంద్రశేఖర్ దంపతులు కూడా అదే రోజు పులివెందుల పట్టణంలో ఉన్న తమ కుమార్తెను చూడడానికి ఇంటికి తాళం వేసి వెళ్లారు. వారి ఎదురింట్లో ఉండే గుణశేఖర్ కూడా ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో కలిసి షిర్డీ దర్శనార్థం వెళ్లారు. దొంగలు ఆ మూడు ఇళ్ల తాళాలు పగులకొట్టి 42 తులాల బంగారం, రూ 2.35 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఈ విషయం తెలుసుకుని బాధితులు లబోదిబోమన్నారు.


