● వైఎస్సార్సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి పంతగిరి ఇందిరమ్మ
చిల్లకూరు: ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యమివ్వనున్నానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గూడూరు చైర్‌పర్సన్ అభ్యర్థి పంతగిరి ఇందిరమ్మ పేర్కొన్నారు. ఈ మేరకు సాక్షి నిర్వహించిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఆమె మాట్లాడారు. పోటీ చేసే అవకాశాన్ని తనకు పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి కల్పించారని చెప్పారు. తనను ప్రజలు ఆశీర్వదిస్తే, గూడూరు రూపురేఖలను మారుస్తానని ప్రకటించారు.
ప్రశ్న: రాజకీయాలు కొత్త కదా..
ఎలా నెగ్గుకురాగలరు..?
సమాధానం: రాజకీయాలు కొత్తగానే ఉంటాయి. అందర్నీ కలుపుకొని.. వారి సహాయ, సహకారాలతో ముందుకెళ్తున్నాను. గూడూరులోనే పుట్టి.. పెరిగా. సాధ్యమైనంత వరకు అందర్నీ కలుపుకెళ్తూ, పట్టణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తా.
ప్రశ్న: మీ అజెండా ఏమిటి..?
సమాధానం: వృత్తిపరంగా ఉపాధ్యాయురాలిగా పనిచేశా. మున్సిపాల్టీ పరిధిలోని ప్రతి పాఠశాలలో మౌలిక వసతులపై దృష్టి సారిస్తా. నాడు – నేడు ద్వారా స్కూళ్లలో వసతుల కల్పనకు గత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో కృషి చేశారు. ఇంకా ఏమైనా ఉంటే వాటిని పరిష్కరిస్తా. ఆస్పత్రుల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారిస్తాం.
ప్రశ్న: పట్టణ ప్రజలకు మీరిచ్చే సందేశం..?
సమాధానం: పట్టణ ప్రజలు ఎంతో విజ్ఞత కలిగిన వారు. గతంలో మా పార్టీ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిని వీరు గమనించారు. ఇదే అభిమానం, ప్రేమను మరోసారి చూపించేందుకు మున్సిపల్ ఎన్నికలు ఓ చక్కటి వేదిక. పార్టీని ఆదరిస్తారని ఆశిస్తున్నా.
కుటుంబ నేపథ్యం
పేరు: ఇందిరమ్మ
చదువు: బీఏ
వృత్తి : ఉపాధ్యాయురాలు
భర్త, ఇద్దరు పిల్లలు
ప్రశ్న: ప్రధాన సమస్యలపై
ఎలాంటి దృష్టి సారిస్తారు..?
సమాధానం: పట్టణంలో పదేళ్ల క్రితం వరకు రెండు పూటలా ప్రజలకు తాగునీరందేది. అయితే ప్రస్తుతం ఇదే అతి పెద్ద సమస్యగా మారింది. నాకు పట్టం కడితే, ఈ సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకెళ్తా. గతంలో 33 వార్డులుగా ఉన్న గూడూరు.. విలీన గ్రామాలతో కలిపి 48 వార్డులుగా రూపాంతరం చెందింది. ప్రాధాన్య క్రమంలో అన్ని వార్డుల అభివృద్ధికి కృషి చేస్తా.


