● వైఎస్సార్సీపీ చైర్మన్ అభ్యర్థి
కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి
కావలి: కావలిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సాక్షి నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. తన రాజకీయ ప్రస్థానంలో ప్రజలతో మమేకమై పనిచేయడం మాత్రమే తెలుసునని చెప్పారు. కలికి యానాదిరెడ్డి శిష్యుడిగా అన్ని వర్గాల వారితో సత్సంబంధాలను కలిగి ఉన్నానని వివరించారు.
ప్రశ్న: ఎన్నికల ప్రచారమెలా సాగింది..?
సమాధానం: ప్రచారంలో భాగంగా ప్రజలను కలిసి సమస్యలను తెలుసుకున్నా. అనేక అంశాలను నా దృష్టికి తీసుకొచ్చారు. మౌలిక వసతులు కల్పనకు పెద్దపీటేస్తాం. కలుగోళమ్మ శాంభవి ఆలయం వద్ద ఫ్లయ్‌ఓవర్ నిర్మాణం.. నిలిచిపోయిన పనులను ప్రారంభించేలా చర్యలు చేపడతాం. భూగర్భ డ్రైనేజీతో పాటు మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకొస్తాం.
ప్రశ్న: ఎలాంటి పాలనను అందిస్తారు..?
సమాధానం: అవినీతికి తావులేని విధంగా పారదర్శక పాలనను అందించడమే లక్ష్యం. ప్రజలు ఆదరిస్తారనే నమ్మకముంది. పేదల జీవితాల్లో మా పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వెలుగులు నింపారు. వీటితో పాటు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అండదండలు నా విజయానికి బాటలేస్తాయి.


