నెల్లూరురూరల్: నెల్లూరులోని శాలివాహన కల్యాణ మండపం భవనంపై పూర్తి హక్కులు జిల్లా కుమ్మర శాలివాహన సంఘానికే ఉన్నాయని ప్రతినిధులు తెలిపారు. సోమవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా నేతలు మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులు వేరే సంఘాన్ని ఏర్పాటు చేసుకుని భవనాన్ని లీజుకు తీసుకున్నప్పటికీ అద్దె చెల్లించడం లేదన్నారు. శాలివాహన భవన నిర్వహణ కమిటీ సొసైటీకి ఎన్నికలు నిర్వహించేందుకు 2024 నుంచి ప్రయత్నిస్తున్నా అడ్డుకుంటున్నారని తెలిపారు. ఈనెల 29న శాలివాహన మండపంలో కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారని, అయితే ప్రస్తుతం భవనం లీజు వ్యవహారం కోర్టులో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా కుమ్మర శాలివాహన సంఘానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎడవల్లి మల్లికార్జున, సంక్షేమ భవన నిర్వహణ కమిటీ అధ్యక్షుడు నరసయ్య, దాతలు తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయ పంటల్లో
సస్యరక్షణ కీలకం
నెల్లూరు(వేదాయపాళెం): ప్రస్తుత రబీ సీజన్‌లో ప్రత్యామ్నాయ పంటలు సాగుచేస్తున్న రైతులు సస్యరక్షణ, తేమ సంరక్షణకు అధిక ప్రాధాన్యతనివ్వాలని కేవీకే అధిపతి, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్‌వీ సరళ తెలిపారు. నెల్లూరు కార్యాలయ ప్రాంగణంలో సోమవారం ఆమె మాట్లాడుతూ దీర్ఘకాలిక వర్షాభావ పరిస్థితులతో మెట్ట ప్రాంతాల్లో పంటలు నీటి ఎద్దడికి గురయ్యే అవకాశం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేలలోని తేమను కాపాడుకునేందుకు పంటల మధ్య అంతరకృషి చేపట్టాలని సూచించారు. జొన్న, మినుము, కంది, శనగ తదితర పంటల్లో పురుగులు, తెగుళ్ల ఉనికిని ఎప్పటికప్పుడు గమనిస్తూ గుడ్లు, పిల్ల దశలోనే నివారించాలని తెలిపారు. అవసరమైన చోట లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసి, వేప ఆధారిత ఉత్పత్తులను వినియోగించాలన్నారు. పురుగుల ఉధృతి అధికంగా ఉండి తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లే పరిస్థితుల్లో మాత్రమే సంబంధిత పంటకు శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన పురుగు మందులను తగిన మోతాదులో పిచికారీ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె వివిధ పంటల్లో తెగుళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో సుజాత, విజయ్, కిరణ్, అనూష పాల్గొన్నారు.


