పెన్షనర్లను వేధిస్తున్న బకాయిల సమస్య | - | Sakshi
Sakshi News home page

పెన్షనర్లను వేధిస్తున్న బకాయిల సమస్య

Nov 24 2026 12:12 AM | Updated on Nov 24 2026 12:12 AM

● చెల్లింపుపై స్పష్టత కరువు

● ఎస్‌జీపీఏ జిల్లా శాఖ అధ్యక్షుడు

ఎస్‌ఎంగౌస్‌

నెల్లూరు(బృందావనం): రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు డీఆర్‌ బకాయిల చెల్లింపుపై స్పష్టత కొరవడిందని స్టేట్‌ గవర్నమెంట్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ (ఎస్‌జీపీఏ) ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా శాఖ అధ్యక్షుడు ఎస్‌ఎం గౌస్‌ తెలిపారు. నెల్లూరు భక్తవత్సలనగర్‌లోని పెన్షనర్స్‌ భవన్‌లో సోమవారం నిర్వహించిన అసోసియేషన్‌ జిల్లా కార్యవర్గ, సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. డీఆర్‌ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో, అసలు చెల్లిస్తారో లేదో అన్న దానిపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. పెన్షన్‌ వాలిడేషన్‌ చట్టం 2025 వల్ల విశ్రాంత ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇప్పటికే రెండుసార్లు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు నిర్వహించినా మార్పు రాకపోవడం విచారకరమన్నారు. వయోభారం కారణంగా పెన్షనర్లు ప్రభుత్వ విధానాలతో అనేక వ్యయప్రయాసలకు గురవుతున్నారని తెలిపారు. 12వ పీఆర్సీ అమల్లోకి వచ్చేలోగా తీర్పు ప్రతికూలంగా వస్తే సమస్య మరింత జటిలమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్పీవీఎన్‌ మూర్తి మాట్లాడుతూ నిర్బంధ ఉద్యోగ విరమణపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను వివరించారు. జీవిత భాగస్వామికి పెన్షన్‌, ఇతర ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు. కోశాధికారి జె.హజరత్తయ్య, ఉపాధ్యక్షుడు ఎ.రమణయ్య వివిధ అంశాలను వెల్లడించారు. ఆత్మకూరు, కావలికి చెందిన అసోసియేషన్‌ నాయకులు కె.సుధాకర్‌, పి.రవికుమార్‌ మాట్లాడారు. అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు గోపాల్‌, వీరేంద్ర, కె.సుబ్బారావు, భాస్కరరావు, హెచ్‌.లక్ష్మణరావు, పి.వేణు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement