పరిషత్‌ పీఠాలకు పట్టం | - | Sakshi
Sakshi News home page

పరిషత్‌ పీఠాలకు పట్టం

Nov 19 2026 12:43 AM | Updated on Nov 19 2026 12:43 AM

● మంత్రులు నారాయణ, ఆనం..

ఎమ్మెల్యే కోటంరెడ్డి పరపతికి చెక్‌

● కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డికే చైర్మన్‌ పీఠం ఖరారు?

● ఆత్మకూరు జెడ్పీటీసీ పేరును

ప్రతిపాదించిన ఆనం

● వంటేరు పేరును తెరపైకి తెచ్చిన

కోటంరెడ్డి.. చివరకు వెనక్కి తగ్గిన వైనం

● కంభం ఆశలపై నీళ్లు..

రేపు జెడ్పీ చైర్మన్‌ ఎంపిక

● ఎంపీపీలకు నేడు.. జెడ్పీకి రేపు

● ఏర్పాట్లు పూర్తి

పీఠం

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పీఠం చుట్టూ సాగిన రాజకీయ ఉత్కంఠకు తెరపడుతోంది. జిల్లాలో కూటమి రాజకీయాలపై తనదైన ముద్ర వేస్తున్న నెల్లూరు పార్లమెంట్‌ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మరో సారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. జెడ్పీ చైర్మన్‌ ఎంపిక వ్యవహారంలో మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వంటి నేతల ప్రతిపాదనలకు చెక్‌పెడుతూ కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేరు తెరపైకి తీసుకురావడం ప్రాధాన్యం సంతరించుకుంది. చివరకు జెడ్పీ పీఠం ఆయనకే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పోటాపోటీ ప్రతిపాదనలు

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎంపిక అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి అధికార కూటమిలో అంతర్గత రాజకీయాలు వేడెక్కాయి. ఈ పదవిని తమ అనుచరులకు ఇప్పించుకునేందుకు పలువురు ముఖ్య నేతలు ప్రయత్నాలు సాగించారు. ఇందులో భాగంగా ఆత్మకూరు జెడ్పీటీసీ సభ్యుడు డాక్టర్‌ తూమాటి శశిధర్‌రెడ్డి పేరును చైర్మన్‌ పదవికి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రతిపాదించినట్లు సమాచారం. మరో వైపు నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన తరఫున కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి పేరును తెరపైకి తీసుకొచ్చారు.

పోలంరెడ్డికి లైన్‌ క్లియర్‌?

తాజా పరిణామాలన్నీ కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తున్నాయి. జిల్లాలో 35 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, అందులో కోవూరు నియోజకవర్గంలోని మూడు జెడ్పీటీసీలను వేమిరెడ్డి దంపతులు తమ పలుకుబడితో ఏకగ్రీవం చేయించుకున్నారు. ఎన్నికల ఖర్చులకు సైతం పోలంరెడ్డి ప్రతి జెడ్పీటీసీ స్థానానికి భారీగా నిధులు సమకూర్చినట్లు సమాచారం. ఇదే సమయంలో జిల్లా రాజకీయాల్లో వేమిరెడ్డి వర్గానికి ఉన్న ప్రాధాన్యం నేపథ్యంలో ఆయనకు చైర్మన్‌ పదవి దక్కే అవకాశాలున్నాయన్న ప్రచారం జోరందుకుంది. ఈ పరిణామం జిల్లాలోని ఇతర ముఖ్య నేతల రాజకీయ ప్రాధాన్యంపై కూడా చర్చకు దారి తీస్తోంది. ముఖ్యంగా మంత్రులు నారాయణ, ఆనం, ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రతిపాదనల మధ్య పోలంరెడ్డి పేరు ముందుకు రావడం వేమిరెడ్డి రాజకీయ పలుకుబడికి నిదర్శనంగా కూటమి వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

రేపే కీలక ఘట్టం

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎంపిక ప్రక్రియకు శుక్రవారం రంగం సిద్ధమైంది. ఇప్పటికే తెర వెనుక మంతనాలు, ప్రతిపాదనలు, రాజకీయ సమీకరణాలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. అధికారిక ఎంపిక ప్రక్రియలో ఎవరి పేరు ఖరారవుతుందన్నది ఉత్కంఠ రేపుతోంది. పోలంరెడ్డికి పీఠం దక్కితే జిల్లాలో కూటమి రాజకీయాల్లో వేమిరెడ్డి హవా మరోసారి స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లవుతుంది. మొత్తానికి జెడ్పీ చైర్మన్‌ కుర్చీ చుట్టూ సాగిన ఆధిపత్య పోరులో ఎవరి మాట నెగ్గిందన్నది రేపటితో తేలనుంది.

అందేట్లు లేదు

బీఫారం తీసుకుని..వెనక్కి

జెడ్పీ చైర్మన్‌ రేసులో వంటేరు పేరు బలంగా వినిపించింది. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నెల్లూరు రూరల్‌ నుంచి వంటేరు బీఫారం అందుకుని నామినేషన్‌ వేశారు. తర్వాత రాజకీయ పరిణామాలు గమనించి అనూహ్యంగా ఆయన పోటీ నుంచి వైదొలగడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. బీఫారం తీసుకున్న తర్వాత విత్‌డ్రా చేసుకోవడం వెనుక అధిష్టానం నిర్ణయం ఉందా? లేక జిల్లాలోని ముఖ్య నేతల మధ్య కుదిరిన రాజకీయ సమన్వయమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరో వైపు టీడీపీ సీనియర్‌ నేత మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి సైతం అధిష్టానం అనుమతితోనే జెడ్పీ చైర్మన్‌ పదవిపై ఆశలు పెట్టుకుని పోటీ చేసి గెలిచారు. అయితే తాజా పరిణామాలతో ఆయన ఆశలకు గండిపడినట్లయింది. పోలంరెడ్డి జెడ్పీ చైర్మన్‌ అయితే కంభం జెడ్పీటీసీ సభ్యుడిగా కొనసాగుతారా? లేక గతంలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాదిరిగా పదవి దక్కకపోవడంతో రాజీనామా చేస్తారా? అనేది వేచిచూడాల్సి ఉంటుంది.

నెల్లూరు(పొగతోట): జెడ్పీ చైర్మన్‌, ఎంపీపీల ఎన్నికల నిర్వహణకు చర్యలను అధికారులు చేపట్టారు. ఎంపీపీల ఎన్నికలను గురువారం.. జెడ్పీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎలక్షన్‌ను శుక్రవారం నిర్వహించనున్నారు. జెడ్పీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలకు చర్యలను సీఈఓ మధుసూదన్‌, డిప్యూటీ సీఈఓ బ్రహ్మయ్య చేపట్టారు. 35 మండలాల్లో ఎంపీపీలు, కో ఆప్షన్‌ సభ్యులు, వైస్‌ ఎంపీపీల ఎలక్షన్‌ను జరపనున్నారు.

ప్రక్రియ ఇలా..

జెడ్పీ కో ఆప్షన్‌ సభ్యుల నుంచి నామినేషన్లను కలెక్టర్‌ హిమాన్షు శుక్లా శుక్రవారం ఉదయం పదింటికి స్వీకరించనున్నారు. ఆపై మధ్యాహ్నం 12 గంటలకు పరిశీలించనున్నారు. జెడ్పీటీసీలతో ప్రమాణ స్వీకారాన్ని మధ్యాహ్నం ఒంటి గంటకు చేయించనున్నారు. అనంతరం కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నికల ప్రక్రియను నిర్వహించనున్నారు. జెడ్పీ ప్రత్యేక సమావేశాన్ని మూడు గంటలకు నిర్వహించి.. చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. దీనికి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. సమావేశానికి నెల్లూరు నగర ఎమ్మెల్యే, మంత్రి నారాయణకు మాత్రం ఆహ్వానం లేదు.

ఎంపీపీలకు ఇలా..

కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు నామినేషన్లను మండలాధికారులు గురువారం ఉదయం పదికి స్వీకరించి, మధ్యాహ్నం 12కు పరిశీలించనున్నారు. అనంతరం ఎంపీటీసీలతో ప్రమాణ స్వీకారాన్ని చేయించి, కో ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకోనున్నారు. ఆపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలను ఎన్నుకోనున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని ఏదో ఒక మండలంలో పాల్గొనొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement