● సీఎంపై ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి
కావలి: ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో రాష్ట్రంలో దుష్ట రాజకీయాలకు సీఎం చంద్రబాబు తెరలేపారని.. ఇందులో భాగంగానే అరాచకాలు, పచ్చ ముష్కరులతో రణరంగాన్ని సృష్టిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కావలి మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచే పార్టీ కౌన్సిలర్లు, చైర్మన్ అభ్యర్థులకు పార్టీ బీ – ఫారాలను పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో బుధవారం అందజేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కాకాణి మాట్లాడారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన సమయంలో అధికార పార్టీ రెచ్చిపోయిన వైనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో కారణాన్ని చూపి తమ పార్టీ తరఫున పోటీ చేసిన వారి తప్పించాలని చూడటంపై మండిపడ్డారు. నామినేషన్లను తిరస్కరించాలని అధికారులపై ఒత్తిడి తేవడం, దౌర్జన్యానికి పాల్పడటం దారుణమన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ఈ యత్నానికి ఒడిగట్టడమేమిటని నిలదీశారు. ప్రశ్నించినందుకు గానూ ప్రతాప్‌కుమార్‌రెడ్డిపైకి దూసుకొచ్చి దాడికి యత్నించడం శోచనీయమని చెప్పారు. ఇదే మీ విధానమైతే పోలీసులను పక్కనబెట్టి రావాలని సవాల్ విసిరారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన అనంతరం చంద్రబాబు పారిపోయి హైదరాబాద్‌లో దాక్కున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎలక్షన్లలో తమ పార్టీ శ్రేణులు పోరాడుతున్నారని చెప్పారు. చంద్రబాబు పాలనపై ప్రజలు విసిగిపోయారని, గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. అరాచకాల్లో బిహార్‌ను మించిపోయారని ధ్వజమెత్తారు. ప్రజాపాలనకు ప్రస్తుతం అర్థం లేకుండా చేశారని విమర్శించారు. కావలి బరిలో ఉన్న 44 మంది అభ్యర్థులు కష్టపడి.. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తమ పార్టీ జెండాను రెపరెపలాడించాలని పిలుపునిచ్చారు.


