మర్రిపాడు: విధి చిన్నచూపు చూడటంతో ఓ యువకుడు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. మర్రిపాడు మండలం చిన్నమాచనూరు గ్రామానికి చెందిన నూతలపాటి ప్రేమ్‌కుమార్ (32) లూపస్ నెఫ్రైటిస్ వ్యాధి కారణంగా మూత్రపిండాల పనితీరు తీవ్రంగా దెబ్బతిని ప్రాణాలతో పోరాడుతున్నాడు. నెల్లూరులోని నారాయణ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వైద్యులు డయాలసిస్ నిర్వహిస్తున్నారు. ప్రేమ్‌కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఒంటిపై వాపులు, తీవ్ర రక్తహీనత వంటి సమస్యలు తలెత్తడంతో అక్టోబర్ 26న ఆస్పత్రిలో చేరాడు. వైద్య పరీక్షల్లో కిడ్నీల పనితీరు తీవ్రంగా దెబ్బతిన్నట్లుగా డాక్టర్లు గుర్తించారు. దీంతో ఇప్పటివరకు ఆరు విడతల హీమోడయాలసిస్ నిర్వహించడంతోపాటు రక్తహీనత కారణంగా రక్తం ఎక్కించారు. భవిష్యత్‌లోనూ క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓవైపు అనారోగ్య సమస్యలు, మరోవైపు వైద్య ఖర్చులు ఆ కుటుంబాన్ని ఆర్థికంగా కుంగదీస్తున్నాయి. ఇంటి పెద్దగా అండగా నిలవాల్సిన వ్యక్తి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతుండటంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య చికిత్సను కొనసాగించేందుకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దాతలు, మానవతావాదులు ముందుకొచ్చి అండగా నిలవాలని వేడుకుంటున్నారు.
దాతలు సంప్రదించాల్సిన
ఫోన్ నంబర్ : 86887 97997
కిడ్నీ వ్యాధితో
మంచానపడిన వ్యక్తి
వైద్య ఖర్చులు భరించలేక కుటుంబం ఆవేదన
దాతల సాయం కోసం ఎదురుచూపు


