డిప్యూటీ మేయర్‌ పదవి వరింపు పరపతా.. సామాజిక తూకమా? | - | Sakshi
Sakshi News home page

డిప్యూటీ మేయర్‌ పదవి వరింపు పరపతా.. సామాజిక తూకమా?

Nov 18 2026 12:08 AM | Updated on Nov 18 2026 12:08 AM

నెల్లూరు (బారకాసు): నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం ఈ నెల 23వ తేదీన జరగనుంది. అయితే ఈ ప్రక్రియ అనంతరం డిప్యూటీ మేయర్‌ పదవికి ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఈ పదవికి టీడీపీలోని సీనియర్లతోపాటు కూటమిలోని బీజేపీ, జనసేన పార్టీల నుంచి పోటీ అధికంగా ఉంది. నెల్లూరు మేయర్‌ స్థానాన్ని ఆశించి భంగపడిన బీజేపీకి కనీసం డిప్యూటీ మేయర్‌ పదవి అయినా ఇవ్వాలని ఆ పార్టీ పట్టుబడుతోంది. ఇక జనసేన నేతలు సైతం దాదాపు 24 సీట్లు ఆశించి.. త్యాగం చేసి చివరకు రెండు సీట్లతో సరిపెట్టుకున్నామని పార్టీలో భాగస్వామ్య పక్షంగా తమకే కేటాయించాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. మేయర్‌ అభ్యర్థిత్వం విషయంలో తన పాచికలు పారకపోవడంతో నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మౌనంగా ఉన్నారు. అయితే మేయర్‌ అభ్యర్థిత్వంపై పార్టీ అధిష్టానం మంత్రి ఆనం రామనారాయణరెడ్డిను సంప్రదించుకుండానే ప్రకటించింది. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ అభ్యర్థి విషయంలోనూ తనకు తెలియకుండానే ప్రకటించడంతో ఆయన ప్రభ మసకబారినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నెల్లూరు నగరంలో ఆనం కుటుంబం నుంచి చేజారిపోయింది. ఈ క్రమంలో తన పట్టు నిలుపుకునేందుకు రెడ్డి సామాజిక వర్గాలను ఏకీకృతం చేసేందుకు మంగళవారం మంత్రి ఆనం నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డిని ఆయన నివాసంలో కలిసి డిప్యూటీ మేయర్‌ పదవిని తన అన్న కుమారుడు రంగమయూర్‌రెడ్డికి కట్టబెట్టే విధంగా అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. తద్వారా మంత్రి నారాయణ ప్రాబల్యాన్ని తగ్గించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ పదవిపై పలువురు ఆశావహులు ఎవరికి వారు తమ రాజకీయ పలుకుబడి, అధికార పార్టీ పెద్దలతో ఉన్న సత్సంబంధాల ద్వారా ఆశలు పెట్టుకుని పావులు కదుపుతున్నారు.

సామాజిక పరంగా డిమాండ్లు

నెల్లూరంటేనే పెద్దారెడ్ల అడ్డా అని పేరొంది. అటువంటి రెడ్లకు కనీసం డిప్యూటీ మేయర్‌ పదవినైనా ఇవ్వాలని ఆ సామాజికవర్గం నుంచి డిమాండ్‌తోపాటు ఎంపీ వేమిరెడ్డి సైతం ఇదే ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం. నెల్లూరు మేయర్‌ జనరల్‌ స్థానం కావడంతో ఆ పదవిని వైఎస్సార్‌సీపీ రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించగా, టీడీపీ కూడా అదే సామాజిక వర్గానికి కేటాయిస్తుందని ఆ పార్టీ లోని రెడ్లు భావించారు. అయితే మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన బీసీ సామాజిక వర్గానికి చెందిన రూప్‌కుమార్‌యాదవవ్‌కు కట్టబెట్టడంతో రెడ్డి సామాజిక వర్గం మనస్తాపానికి గురైంది. ఎప్పుడో కానీ తమకు వచ్చే అవకాశాన్ని సైతం బీసీ వర్గానికి కేటాయించారంటూ తీవ్ర అసంతృప్తి నెలకొంది. అయితే ఆ అవకాశం దక్కకపోయినా.. కనీసం డిప్యూటీ మేయర్‌ను రెడ్లకు కేటాయించాలని డిమాండ్‌ అధికంగా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎంపీ వేమిరెడ్డి సైతం డిప్యూటీ మేయర్‌ స్థానాన్ని రెడ్లకే ఇవ్వాలనే ప్రతిపాదనలు సైతం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు మేయర్లు, డిప్యూటీ మేయర్ల వరకు ఇప్పటి వరకు తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత దక్కలేదని, ఈ సారి కనీసం డిప్యూటీ మేయర్‌ పదవిని తమ సామాజికి వర్గానికే కేటాయించాలంటూ ఆయా వర్గాలు డిమాండ్‌ చేస్తూ మీడియా సమావేశాలు పెట్టి ప్రతిపాదించాయి. నగరంలో అత్యధిక ఓట్‌ బ్యాంక్‌ కలిగిన ముస్లింలకు ఇవ్వాలంటూ ఆ సామాజికవర్గం పట్టుబడుతోంది. ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించినట్లు తెలుస్తోంది.

రెండు పదవుల నుంచి ఒకటికే..

కార్పొరేషన్‌లో డిప్యూటీ మేయర్‌కు ఇద్దరిని ఎంపిక చేసే విధంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు అప్పట్లో మేయర్‌ స్థానం ఎస్టీ మహిళకు కేటాయించడంతో రెండు డిప్యూటీ మేయర్ల పదవులకు ఒకటి బీసీ సామాజికవర్గానికి చెందిన రూప్‌కుమార్‌, మరో పదవిని ముస్లిం మైనార్టీకి చెందిన ఖలీల్‌ అహ్మద్‌కు పట్టం కట్టారు. తాజాగా కూటమి ప్రభుత్వం రెండు డిప్యూటీ మేయర్‌ పదవులను ఒకటిని చేయడంతో మరొకరికి అవకాశం దక్కని పరిస్థితి.

టీడీపీలో భారీగా

ఆశావహులు

తమకే ఇవ్వాలని బీజేపీ,

జనసేన డిమాండ్‌

రెడ్డి, ఎస్సీ, ముస్లిం సామాజిక వర్గాలు సైతం పట్టుబడుతున్న వైనం

మేయర్‌ అభ్యర్థిత్వంపై పారని కోటంరెడ్డి పాచికలు

డిప్యూటీ మేయర్‌ పదవికి మంత్రి ఆనంతో కలిసి అధిష్టానంపై ఒత్తిడి

ఈ నెల 23న మేయర్‌ ప్రమాణ స్వీకారం.. అదే రోజు డిప్యూటీ మేయర్‌ నియామకం

కో ఆప్షన్‌ పదవుల కోసం పోటీ

కో–ఆప్షన్‌ మెంబర్‌ పదవి కోసం పలువురు ఆశావహులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే కొందరు సిఫార్సుల కోసం ప్రజాప్రతినిధుల వద్దకు క్యూ కడుతున్నారు. నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కో–ఆప్షన్‌ సభ్యులుగా మొత్తం ఐదుగురు ఉంటారు. ఇందులో ఇద్దరు మైనార్టీలు కాగా అందులో ఒకరు మహిళ ఉండాలి. మరో ముగ్గురు సీనియర్‌ కార్పొరేటర్లు కానీ కార్పొరేషన్‌లో మేనేజర్‌ స్థాయి కంటే ఎక్కువ హోదాలో పనిచేసి రిటైర్‌ అయిన వారుండాలి. వారిలోనూ ఒక మహిళ కచ్చితంగా ఉండాలి. ఈ పదవుల కోసం ఎవరికి వారు తమ ప్రయత్నాలు ముమ్మరంగా చేసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు నాయకులు తాము సూచించిన వారికే కేటాయించాలని ప్రజాప్రతినిధులను పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే కూటమిలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనన్న సందిగ్ధత నెలకొంది. ఇటువంటి వాటన్నింటికి సంబంధించిన సందేహాలకు తెరపడాలంటే వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement