బరితెగించిన ఖాకీల బెదిరింపులు | - | Sakshi
Sakshi News home page

బరితెగించిన ఖాకీల బెదిరింపులు

Nov 17 2026 12:14 AM | Updated on Nov 17 2026 12:14 AM

ప్రజాక్షేత్రంలో ఎన్నికలంటే కూటమికి టన్నుల్లో భయం పట్టుకుంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు తమకు ప్రత్యర్థిగా బరిలోకి దిగుతున్నారంటే వణికిపోతోంది. ప్రజాతీర్పును ఎదుర్కొనే ధైర్యం లేక దౌర్జన్యాలనే ఆయుధంగా చేసుకుని అరాచకాలకు తెగబడుతోంది. ఖాకీలను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు కూడా వేయనీయకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలివిడత పుర, పరిషత్‌ ఎన్నికల్లో సాగించిన అరాచక పర్వాన్ని.. రెండో విడత పుర, పంచాయతీ ఎన్నికల్లోనూ కొనసాగిస్తున్నారు. పోలీసులు సైతం పచ్చముష్కరులు సాగిస్తున్న దాష్టీకాలను చూస్తూ.. మౌనంగా వ్యవహరిస్తున్నారు. బరితెగించిన కొందరు ఖాకీలు మరో అడుగు వేసి అభ్యర్థులను స్టేషన్లో నిర్బంధించి.. నామినేషన్లు వేయొద్దని బెదిరింపులకు దిగుతున్నారు.

సాక్షిప్రతినిధి నెల్లూరు: ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియను పచ్చమూకలతో కలిసి ఖాకీలు రణరంగం చేస్తున్నారు. పచ్చముష్కరులు సాగిస్తున్న స్వైరవిహారానికి ఖాకీల మౌనం తోడవడంతో అధికార పార్టీ నేతల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నామినేషన్‌ కేంద్రాల వద్దే ప్రతిపక్ష అభ్యర్థులపై దాడులకు తెగబడుతున్నా.. నామినేషన్‌ పత్రాలు చించివేస్తున్నా అడ్డుకోవాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్నారు. మరో వైపు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష అభ్యర్థులనే లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు దిగుతున్నారన్న ఆరోపణలు పోలీసు శాఖ వ్యవహార శైలిపై తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఎన్నికలు ఏవైనా.. అధికార పార్టీ నేతలు.. ఖాకీ తీరు ఏమాత్రం మారలేదని మరోసారి స్పష్టమైంది.

నక్కజిత్తుల నాటకాలు.. కూటమి కుతంత్రాలు

జిల్లాలోని కావలి, గూడూరు మున్సిపాల్టీలు, అల్లూరు నగరపంచాయతీ నామినేషన్ల ప్రక్రియ సోమవారంతో ముగిసింది. అయితే అల్లూరును నగర పంచాయతీగా ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ గతంలో స్థానికులు కోర్టుకెళ్లడంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. అయితే ఈ దఫా కూడా కోర్టు వివాదాలతో తొలివిడతలో ఎన్నికల ప్రక్రియ జరగలేదు. తాజాగా ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు సైతం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఎన్నికల ప్రక్రియను ఎస్‌ఈసీ ప్రారంభించింది. అయితే అధికార కూటమి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కలిసి వైఎస్సార్‌సీపీతో మంతనాలు చేసి.. నామినేషన్లు వేయకుండా ఎన్నికలను బహిష్కరించాలంటూ అఖిల పక్షంగా తీర్మానాలు చేశారు. రెండు రోజుల పాటు ఒక్క నామినేషన్‌ దాఖలు చేయకుండా మిన్నకున్న టీడీపీ నేతలు అసలు కుతంత్రానికి తెర తీశారు. ఏకగ్రీవంగా అధికారాన్ని చేజిక్కించుకోవాలని కూటమి పార్టీలు ఆఖరి క్షణంలో నక్కజిత్తుల నాటకాలతో నామినేషన్లు వేసి తమ నిజస్వరూపాన్ని చాటుకున్నారు.

పరాకాష్టకు చేరిన ముష్కరుల దాష్టీకం

పోటీ చేస్తే ఓటమి తప్పదని భావించిన టీడీపీ నేతలు తమ ముష్కరులతో దాష్టీకాలకు తెగించారు. మండల కేంద్రంగా ఉన్న చిల్లకూరు మేజర్‌ పంచాయతీ గూడూరు మున్సిపాలిటీ విలీనం కావడంతో 24, 25, 26 వార్డులుగా విభజించి ఎన్నికల ప్రక్రియ చేపట్టారు. అయితే ఈ మూడు వార్డుల్లో ఓటమి భయంతో టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డు పెట్టుకుని దౌర్జన్యాలకు తెగబడ్డారు. చిల్లకూరులోని 24వ వార్డుకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా చిల్లకూరు రమణయ్య నామినేషన్‌ దాఖలు చేసేందుకు వెళ్తుండగా టీడీపీ ముష్కరులు అతని వద్ద నుంచి పత్రాలను లాక్కొని చించేశారు. మరో అభ్యర్థి మల్లి రమేష్‌ అతని భార్యతో కలిసి 26వ వార్డుకు నామినేషన్‌ కేంద్రానికి వెళ్తుండగా అధికార పార్టీ నేతల ఆదేశాలతో పోలీసులు అతన్ని ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించి నిర్భందించారు. దీంతో ఆయన భార్య స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగినా.. పోలీసులు చలించలేదు. ఈ క్రమంలో నామినేషన్‌ సమయం మించిపోవడంతో ఆమె చేయలేకపోయారు. 25వ వార్డుకు వైఎస్సార్‌సీపీ తరఫున అభ్యర్థి నామినేషన్‌ దాఖలు చేసేందుకు వెళ్తుంటే.. రూ.15 లక్షల వరకు తాయిలాలు ఇస్తామని బేరాలు మొదలు పెట్టారు. టీడీపీ నేతలు ప్రకటించిన తాయిలాలకు లొంగని అభ్యర్థి చివరి క్షణంలో నామినేషన్‌ దాఖలు చేశారు. గూడూరులోని 37, 48 వార్డులకు నామినేషన్లు వేసేందుకు సుభాన్‌ వెళ్తుండగా పచ్చమూకలు అడ్డుకొని పత్రాలు లాక్కొని చించివేశారు. పోలీసులు అందించిన సమాచారంతోనే పచ్చ ముష్కరులు అక్కడికి చేరుకుని ఈ దాష్టీకానికి పాల్పడ్డారు.

ఎన్నికలంటే

భయపడుతున్న టీడీపీ

తొలి విడత పుర, పరిషత్‌ ఎన్నికల్లో విచ్చలవిడిగా అరాచకాలు

తాజాగా రెండో విడత పుర, పంచాయతీ ఎన్నికల్లోనూ అదే పంధా

గూడూరులో చెలరేగిపోయిన పసుపు ముష్కరులు

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్‌ పత్రాల చించివేత

అభ్యర్థి భర్తను అడ్డుకొని పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధం

మరికొందరికి భారీ మొత్తంలో తాయిలాల ఆఫర్లు

అల్లూరులో ఎన్నికల బహిష్కరణ అంటూ చివరి క్షణంలో నామినేషన్లు వేసిన కుట్రలు

వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌ అభ్యర్థులను నామినేషన్లు వేయొద్దని ఖాకీ బెదిరింపులు

చేజర్ల ఎస్సై బరితెగింపు.. ఆది నుంచి అదే తీరు

జిల్లాలో గూడూరు పుర ఎన్నికలతోపాటు, పంచాయతీ ఎన్నికల్లో ఆయా ప్రాంత ఖాకీలు బరితెగించి.. ప్రతిపక్ష అభ్యర్థులను బెదిరింపులతో కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. పరిషత్‌ ఎన్నికల్లోనూ పచ్చచొక్కాలు వేసుకుని అధికార పార్టీకి పాలేర్లుగా పనిచేసిన ఖాకీలు తాజాగా అదే తీరుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన రోజు నుంచే పలు ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై పోలీసులు బెదిరింపు చర్యలకు దిగారు. నామినేషన్లు వేస్తే తీవ్ర పరిణామాలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. వైఎస్సార్‌సీిపీ అభ్యర్థులు నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకునేందుకు సామదాన దండోపాయాలు ప్రదర్శిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చేజర్ల ఎస్సై ఏ అయ్యప్ప వ్యవహారశైలి విమర్శలకు తావిస్తోంది. అధికార పార్టీ నాయకుల ప్రోద్భలంతో ఎన్నికలకు దూరంగా ఉండాలని లేదంటే కేసులు పెట్టి జైలుకు పంపుతామని ప్రతిపక్ష నేతలను బెదిరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇప్పటికే ఎస్సై వ్యవహారంపై ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి పోలీస్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయన్ను విధుల నుంచి తప్పించి పంచాయతీ ఎన్నికలను నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement