19న జిల్లా స్థాయి పారా క్రీడా ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

19న జిల్లా స్థాయి పారా క్రీడా ఎంపికలు

Nov 17 2026 12:14 AM | Updated on Nov 17 2026 12:14 AM

నెల్లూరు (టౌన్‌): దివ్యాంగుల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో ఈ నెల 19న స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జిల్లా స్థాయి పారా క్రీడా ఎంపికలు నిర్వహించనున్నట్లు డీఈఓ ఆర్‌.బాలాజీరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 13 ఏళ్లు పైబడిన ప్రత్యేకావసరాల పిల్లలు అర్హులన్నారు. అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, వీల్‌ ఛైర్‌ ఫెన్సింగ్‌, బ్లైండ్‌ గోల్‌బాల్‌, పారా తైక్వాండో, టేబుల్‌ టెన్నీస్‌ క్రీడలు బాల, బాలికలు విభాగాల్లో ఎంపికలు ఉంటాయన్నారు. జిల్లాలో అన్ని మండలాల నుంచి అర్హులైన ప్రత్యేకావసరాల విద్యార్థులను గుర్తించి ఈ క్రీడా ఎంపికల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు, జెడ్పీ ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలను ఆదేశించారు. ఈ క్రీడలతో వారిలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీయడంతోపాటు వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించి రాష్ట్ర, జాతీయ స్థాయి పారా క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యమన్నారు. మరిన్ని వివరాలకు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి, నెల్లూరును సంప్రదించాలన్నారు.

వలస ఓటర్లకు

‘రిజర్వేషన్‌’ తిప్పలు

వరికుంటపాడు: జిల్లాలోని కావలి డివిజన్‌లో తొలి దశలో ఈ నెల 26న పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని తొలుత అధికారులు ప్రకటించారు. దీంతో కావలి డివిజన్‌ పరిధిలోని వరికుంటపాడు, దుత్తలూరు మండలాల్లోని వలస ఓటర్లు స్వగ్రామాలకు వచ్చి ఓటు వేసేందుకు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని రాను, పోను రిజర్వేషన్లు సైతం చేసుకున్నారు. అయితే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌లో ఆకస్మికంగా మార్పులు చేస్తూ దుత్తలూరు, వరికుంటపాడు మండలాలకు రెండో దశలో ఈ నెల 29న ఎన్నికలను నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించడంతో వలస ఓటర్లకు బస్సు రిజర్వేషన్ల తిప్పలు తప్పలేదు. ఎన్నికల తేదీ మారడంతో రిజర్వేషన్లు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఎల్‌ఎల్‌బీ పరీక్షలకు

8 మంది గైర్హాజరు

వెంకటాచలం: విక్రమసింహపురి యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో సోమవారం నిర్వహించిన ఎల్‌ఎల్‌బీ పరీక్షలకు 8 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని వీఎస్‌యూ పరీక్షల నిర్వహణాధికారి డాక్టర్‌ ఆర్‌.మధుమతి తెలిపారు. ఉదయం నిర్వహించిన ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ ఏడో సెమిస్టర్‌ పరీక్షలకు 69 మంది హాజరు కాగా, ఆరుగురు గైర్హాజరయ్యారని తెలిపారు. మధ్యాహ్నం నిర్వహించిన తొమ్మిదో సెమిస్టర్‌ పరీక్షలకు 80 మంది విద్యార్థులకుగాను ఇద్దరు గైర్హాజరయ్యాని తెలిపారు.

జిల్లాకు వర్ష సూచన

నెల్లూరు(అర్బన్‌): బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్‌ తుఫాన్‌ నేపథ్యంలో జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే తుఫాన్‌ మచిలీపట్నం వైపు వెళ్తుండటంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని తెలుస్తోంది. బుధ, గురువారాల్లో వానలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు.

శ్రీవారి దర్శనానికి

18 గంటలు

తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 82,173 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 27,058 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.21 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో, దర్శన టికెట్లు లేని వారికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement