గూడూరు: పురపాలక సంఘ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలోనూ పచ్చమూకల అరాచకం పరాకాష్టకు చేరింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ఘట్టంలో వ్యవహరించినట్లుగానే పుర ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనీయకుండా పోలీసుల కళ్ల ముందే పత్రాలు లాక్కొని చించివేశారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తంగా మారింది. వైఎస్సార్‌సీపీ పట్టణ ఉపాధ్యక్షుడు సుభాన్ గూడూరులోని 37, 48 వార్డులకు సంబంధించి నామినేషన్లు వేసేందుకు కోడూరు రవీంద్రరెడ్డితో కలిసి జెడ్పీ హైస్కూల్ వద్ద కేంద్రానికి బయలుదేరారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్ల వద్దకు చేరుకోగానే, విధుల్లో ఉన్న పోలీసులు వారి వార్డు వివరాలను వాకీటాకీలో అనౌన్స్ చేశారు. ఇద్దరు సభ్యులు వారి ప్రతిపాదకులతో కలిసి వస్తున్నారనే సమాచారం విన్న వెంటనే అక్కడే మాటువేసిన సుమారు ఆరుగురు యువకులు దూసుకొచ్చారు. అభ్యర్థులను చుట్టుముట్టి తోపులాటకు దిగారు. మరి కొందరు వారి చేతిలో ఉన్న నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కెళ్లి చించివేశారు. ఈ క్రమంలో ఓ యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించగా వారు రాచమర్యాదలతో వదిలివేశారు.
పోలీసుల తీరుపై ఆరోపణలు
ఈ ఘటన జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న రెండో పట్టణ సీఐ మాలకొండయ్య, తన పోలీసు సిబ్బంది ఉన్నప్పటికీ దుండగులను అడ్డుకోకుండా మిన్నకుండిపోయాడు. టీడీపీ ముష్కరులు వ్యవహరించిన తీరుతోపాటు పోలీసులు అనుసరిస్తున్న చర్యలను సుభాన్ కుమారుడు ఫొటోలు, వీడియోలు తీయగా పోలీసులు ఆ వీడియోలను, ఫొటోలను డిలిట్ చేయించారు.
గూడూరు నామినేషన్ కేంద్రం వద్ద టీడీపీ మూకల దాష్టీకం
పోలీసుల కళ్ల ముందే నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిన దుండగులు
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఘటనలు పుర, పంచాయతీల్లో పునరావృతం


