పసిప్రాణాలకు ముందస్తు పరీక్ష | - | Sakshi
Sakshi News home page

పసిప్రాణాలకు ముందస్తు పరీక్ష

Nov 17 2026 12:14 AM | Updated on Nov 17 2026 12:14 AM

నెల్లూరు(అర్బన్‌): పండంటి బిడ్డ కోసం తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తుంటారు. తొమ్మిదినెలలపాటు కడుపులో మోసి, ఆరోగ్యంగా జన్మించిన బిడ్డను పొత్తిళ్లలోకి తీసుకోవాలని తల్లి కలలు కంటుంది. అయితే కొందరికి ఆ ఆనందం అంత త్వరగా దక్కడం లేదు. గర్భధారణ కాలం పూర్తికాక ముందే జన్మిస్తున్న శిశువులు ప్రాణాల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తక్కువ బరువుతో పుట్టే ఈ చిన్నారులకు తొలిరోజుల్లో ఇంక్యుబేటర్లు రక్షణ కవచంగా మారుతున్నాయి. పేదరికం, తల్లులకు పౌష్టికాహార లోపం, రక్తహీనత, అధిక రక్తపోటు, తక్కువ వయసులో గర్భధారణ, ఆరోగ్య సమస్యలు ముందస్తు ప్రసవాలకు కారణమవుతున్నాయి. ఆధునిక వైద్య విధానాలు అందుబాటులోకి రావడంతో ఒకప్పుడు బతకడం కష్టమని భావించిన 700 గ్రాముల బరువున్న శిశువులను సైతం వైద్యులు కాపాడగలుగుతున్నారు. ప్రతి పసిప్రాణాన్ని రక్షించాలనే లక్ష్యంతో ఏటా నవంబర్‌ 17వ తేదీన ప్రపంచ ప్రీమెచ్యూర్‌ బేబీ డే నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు

37 వారాల ముందే జన్మిస్తే..

సాధారణంగా గర్భధారణ కాలం 40 వారాలు. 37 వారాలు పూర్తికాకముందే జన్మించిన శిశువులను ప్రీమెచ్యూర్‌ బేబీలుగా పరిగణిస్తారు. 32 నుంచి 36 వారాల మధ్య పుట్టిన వారిని చివరి దశ ముందస్తు శిశువులుగా, 28 నుంచి 32 వారాల మధ్య జన్మించిన వారిని చాలా ముందస్తు శిశువులుగా, 28 వారాల కంటే ముందే అయితే అత్యంత ముందస్తు శిశువులుగా విభజిస్తారు. వీరిలో అవయవాల ఎదుగుదల పూర్తికాకపోవడం ప్రధాన సమస్యగా మారుతోంది. తక్కువ బరువుతో ఉన్న 220 మంది గత సంవత్సరం మృతి చెందినట్టు లెక్కలున్నాయి. ఆ తల్లులకు గర్భశోకం మిగిలింది.

అవయవాల ఎదుగుదలే అసలు సమస్య

నెలలు నిండకుండానే జన్మించే శిశువుల్లో ఊపిరితిత్తులు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందకపోవడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోలేకపోవడం, పాలు తాగడంలో సమస్యలు, ఇన్ఫెక్షన్లు, మెదడు సంబంధిత సమస్యలు, కంటి చూపుపై ప్రభావం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. తగిన సమయంలో వైద్యం అందకపోతే ప్రాణాపాయం ఏర్పడే అవకాశం ఉంది.

ఇంక్యుబేటర్లలో ఉంచి..

ప్రీమెచ్యూర్‌ శిశువులను నియోనేటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఎన్‌ఐసీయూ)లోని ఇంక్యుబేటర్లలో ఉంచి ప్రత్యేక వైద్యం అందిస్తారు. శరీరానికి అవసరమైన ఉష్ణోగ్రతను నిర్వహించడంతోపాటు శ్వాస, గుండె స్పందన, ఆక్సిజన్‌ స్థాయిలను నిరంతరం పర్యవేక్షిస్తారు. ఊపిరితిత్తుల అభివృద్ధికి అవసరమైన మందులు, ప్రత్యేక పోషకాహారం అందిస్తారు. శిశువు బరువు పెరిగే వరకు, అవయవాలు తగిన స్థాయిలో పనిచేసే వరకు వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతారు.

అవగాహనతో ముప్పునకు చెక్‌

ముందస్తు ప్రసవాల ముప్పును తగ్గించేందుకు గర్భిణులు గర్భధారణ ప్రారంభం నుంచే వైద్యుల సలహాలు పాటించాలి. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. రక్తహీనత, మధుమేహం, అధిక రక్తపోటు, ఇన్ఫెక్షన్లను ముందుగానే గుర్తించి చికిత్స పొందాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. తీవ్రమైన కడుపునొప్పి, నడుమునొప్పి, రక్తస్రావం, ఉమ్మనీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే గైనకాలజిస్టును సంప్రదించాలి.

నెలలు నిండకుండానే జననం

అమ్మఒడికి చేరే వరకు పోరాటమే

ఇంక్యుబేటరే తొలి నేస్తం

జిల్లాలో 30 శాతానికి పైగా

ముందస్తు ప్రసవాలు

జీజీహెచ్‌లోనూ అధిక సంఖ్యలో

పురిటి బిడ్డలు

నేడు ప్రపంచ ప్రీమెచ్యూర్‌ బేబీ డే

జిల్లాలో ఇదీ పరిస్థితి

జిల్లాలో ఏటా సుమారు 35 వేలకుపైగా ప్రసవాలు జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో 30 శాతానికి పైగా ముందస్తు ప్రసవాలేనని అంచనా. దీంతో పుట్టిన వెంటనే శిశువులకు ప్రత్యేక వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఇక జిల్లా రెఫరల్‌ ఆస్పత్రిగా ఉన్న దర్గామిట్ట ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోనూ ముందస్తు ప్రసవాల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ఇక్కడికి వచ్చే గర్భిణుల్లో ఎక్కువ మంది నిరుపేద కుటుంబాలకు చెందినవారే. పౌష్టికాహార లోపం, రక్తహీనత, రక్తపోటు, తగిన వైద్య పరీక్షలు చేయించుకోకపోవడం వంటి కారణాలతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. గత అక్టోబర్‌లో ఆస్పత్రిలో 149 ప్రసవాలు జరగ్గా, వాటిలో సుమారు 80 మంది శిశువులు నెలలు నిండకుండానే జన్మించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడిస్తున్నాయి. వీరిలో ఒక కిలో కంటే తక్కువ బరువున్న శిశువులు కూడా ఉన్నారు. వీరికి ఎన్‌ఐసీయూలో ప్రత్యేక చికిత్స అందిస్తూ వైద్యులు ప్రాణాలు కాపాడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement