చంద్రబాబు వస్తే.. కరువొస్తది | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు వస్తే.. కరువొస్తది

Nov 17 2026 12:14 AM | Updated on Nov 17 2026 12:14 AM

మనుబోలు: చంద్రబాబు సీఎం అయిన ప్రతిసారి కరువు విలయతాండవం చేస్తోందని, గతంలో కరువు వస్తే నాన్‌ డెల్టాలో వ్యవసాయం సాగకపోతే.. ఈ దఫా డెల్టాలో కూడా సాగు చేయలేని పరిస్థితి నెలకొందని మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. అన్నదాతలను నిలువున ముంచిన మోసగాడని దుయ్యబట్టారు. కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలు అన్యాయానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని మడమనూరుకు వచ్చిన కాకాణి సోమవారం స్థానిక రైతులతో వ్యవసాయ స్థితిగతులపై చర్చించారు. అనంతరం విలేకరుల సమావేశంలో కాకాణి మాట్లాడుతూ రైతాంగానికి అండగా నిలవాల్సిన కూటమి ప్రభుత్వం వారితో కన్నీరు పెట్టిస్తుందని దుయ్యబట్టారు. గ్రామాల్లో పర్యటిస్తుంటే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి జాడలు కానరావడం లేదని విమర్శించారు. రాష్ట్రానికి కోట్లాది రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయని, యువతకు లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని చంద్రబాబుతోపాటు పచ్చమీడియా ఊదరగొట్టుతున్నాయన్నారు. అదే నిజమైతే ఏ కంపెనీలో ఎక్కడ ఎంత మందికి ఉద్యోగాలిచ్చారనే విషయాన్ని బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. సకాలంలో రైతాంగానికి సాగు నీరు సరఫరా చేయలేకున్నారని, కనీసం యూరియా కూడా అవసరాల మేరకు రైతులకు సరఫరా చేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. ప్రస్తుతం ధాన్యం ధరలు బాగా ఉన్నా ప్రభుత్వం చేతకాని తనంతో సకాలంలో సాగునీరు, ఎరువులు, విత్తనాలు అందించలేని దుస్థితిలో ఉందన్నారు. శ్రీశైలం జలాశయం నుంచి జిల్లాకు సాగునీటి ని తరలించే విషయంలో అధికార కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అర్ధాంతరంగా ఆపేశారన్నారు. ఈ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్‌ చేసిన ప్రకటనపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశా రు. ప్రభుత్వం రైతులకు న్యాయం చేయకపోతే వైఎస్సార్‌సీపీ రైతుల తరఫున పోరాటం చేస్తుందని తెలిపారు. తొలుత మండలంలోని మడమనూరులో పార్టీ నాయకుడు బిరదవోలు విష్ణువర్థన్‌రెడ్డి మాతృమూర్తి ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను సోమవారం కాకాణి పార్టీ నాయకులతో కలిసి పరామర్శించారు. ఆయన వెంట నాయకులు మారంరెడ్డి ప్రదీప్‌రెడ్డి, బొమ్మిరెడ్డి హరగోపాల్‌రెడ్డి, కొండూరు జనార్దన్‌రెడ్డి, దాసరి భాస్కర్‌గౌడ్‌, గుండాల వజ్రమ్మ, రామిరెడ్డి, అజయ్‌రెడ్డి, పృధ్వీ మల్లికార్జున, చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రతి దఫా నిరూపితం

అన్నదాతలను అన్ని విధాలుగా

ముంచిన పాలకుడు

కూటమి పాలనలో అన్ని వర్గాలకు అన్యాయమే

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement