నెల్లూరు(బృందావనం): దీపావళికి చందన, సీఎంఆర్‌లో ప్రవేశపెట్టిన బొనాంజా బహుమతుల సంబరాల్లో భాగంగా ఆదివారం స్కూటీ డ్రాను నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తీశారు. నెల్లూరు నవాబుపేటకు చెందిన కల్యాణ్‌రెడ్డి (కూపన్ నంబర్ 46834)ని విజేతగా ప్రకటించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ నమ్మకానికి మారుపేరైన చందన, సీఎంఆర్ షాపింగ్ మాల్స్‌లో పండగలకు వినియోగదారులకు విలువైన బహుమతులు అందజేయడం అభినందనీయమన్నారు. తక్కువ ధరలకే నాణ్యమైన వస్త్రాలు, బంగారు ఆభరణాలు ఇవ్వడం సీఎంఆర్, చందనకే సాధ్యమన్నారు. డైలీ డ్రా విజేతలు 40 మందికి గృహోపకరణాలైన ఇండక్షన్ స్టౌ, మిక్సీ, పట్టుచీర, కెటిల్, డిన్నర్ సెట్లను అందజేశారు. సీఎంఆర్ అధినేత మావూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ దసరా, దీపావళి సంబరాలను విశేషంగా ఆదరించిన సింహపురి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వివాహాలకు అత్యంత తక్కువ ధరలకు పట్టుచీరలు, డ్రెస్ మెటీరియల్ అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మోపూరు పెంచలయ్య, శైలేష్ మేనేజర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
పోర్టులో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక
ముత్తుకూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కృష్ణపట్నం పోర్టులో ఆదివారం ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భారత వాతావరణ శాఖ సూచనల మేరకు పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. సముద్రంలో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారే అవకాశం ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
రైల్లోంచి జారిపడి..
● గుర్తుతెలియని వృద్ధుడి మృతి
నెల్లూరు(క్రైమ్): ప్రమాదవశాత్తు రైల్లోంచి జారిపడి గుర్తుతెలియని వృద్ధుడు మృతిచెందిన ఘటన ఆదివారం నెల్లూరు సౌత్ రైల్వేస్టేషన్ సమీపంలోని మూడో రైల్వే లైన్ వద్ద చోటుచేసుకుంది. మృతుడి వయసు సుమారు 60 నుంచి 65 ఏళ్లు ఉంటుందని, బూడిద రంగు ఫుల్‌హ్యాండ్స్ చొక్కా, నీలం రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడని రైల్వే పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసినవారు నెల్లూరు రైల్వే పోలీసులకు లేదా 92475 75628 నంబర్‌కు సమాచారం అందించాలని ఎస్సై కోరారు.
మినీ ట్రక్కు ఢీకొని
యువకుడికి తీవ్ర గాయాలు
మర్రిపాడు: మండలంలోని రాజుపాళెం వద్ద నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. రాజుపాళేనికి చెందిన కదిరి రాజు అనే యువకుడు ద్విచక్ర వాహనంపై వెళ్తూ వెనుక నుంచి వస్తున్న వాహనాన్ని గమనించకుండా ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాడు. ఈ క్రమంలో బద్వేల్ వైపు నుంచి వస్తున్న మినీ ట్రక్కు అతని బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్‌లో ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
సాలుచింతలలో మహిళ మృతదేహం లభ్యం
కోవూరు: మండలంలోని సాలుచింతల గ్రామంలో పుష్ప వైన్స్ సమీపంలో ఆదివారం ఓ మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతురాలిని ముత్యాలమ్మగా గుర్తించారు. ఆమె మృతికి గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.


