● సెలవుపై నిజాయితీ ఎన్నికల అధికారి
● స్వామిభక్తి చాటుకున్న అధికారి నియమాకం
● హైకోర్టులో మరోసారి రిట్ పిటిషన్ దాఖలు దిశగా వైఎస్సార్‌సీపీ
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సైదాపురం ఎంపీపీ పీఠం దక్కించుకునేందుకు కూటమి నేతలు రాజకీయ కుట్రలకు తెరలేపారు. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన శ్రీనివాసరావు హఠాత్తుగా సెలవు పెట్టడంతో ఇదే అవకాశంగా ఎన్నికల్లో తమకు అన్నివిధాలా అనుకూలంగా వ్యవహరించే అధికారిని నియమించుకున్నారు.
‘టై’ కావడంతో ఉత్కంఠ
మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలున్నాయి. వీటిలో ఆరు స్థానాలు వైఎస్సార్‌సీపీ, మరో ఆరు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో ఎంపీపీ పీఠం టై అయింది. ఈ క్రమంలో ఎంపీపీ ఎంపిక రసవత్తరంగా మారింది. ఈనెల 19న ఎన్నుకోనున్న తరుణంలో ఎలాగైనా కై వసం చేసుకోవాలని కూటమి నేతలు కుట్రలకు పదును పెట్టారు.
అనుకూల అధికారి ద్వారా..
మండల ఎన్నికల అధికారిగా వ్యవహరించిన శ్రీనివాసరావు సెలవుపై వెళ్లారు. దీంతో అధికార పార్టీ నేతలు తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తిని నియమించుకున్నారు. అతను ఇటీవల రాపూరు ఎన్నికల అధికారిగా వ్యవహరించడంతోపాటు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. ఆ మండలంలో 4 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను స్క్రూట్నీలో తప్పించి స్వామిభక్తిని చాటుకున్నారు. ఆరోజు ఆ అధికారి వ్యవహరించిన తీరుపై హైకోర్టులో వైఎస్సార్ సీపీ నాయకులు రిట్ పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో అతడినే సైదాపురం మండల ఎన్నికల అధికారిగా నియమించుకుని ఎంపీపీ ఎంపిక విషయంలో కూడా తిరకాసు చేసుకునేందుకు కూటమి నేతలు పావులు కదుపుతున్నారు. ఇక సాక్షాత్తు ఓ సీఐ, ఎస్సైలు అధికార పార్టీకి అనుకూలురు కావడంతో ఇక అక్రమాలకు పాల్పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే అనుమానాలకు తావిస్తోంది. ఎంపీపీ స్థానాన్ని దక్కించుకునేందుకు ఎంతటికై నా బరి తెగిస్తారనే ప్రచారం జరుగుతోంది. బయట వ్యక్తులను కూడా రంగంలోకి దింపి, భయాందోళనలను సృష్టించి, ఎంపీపీ ఎన్నిక ఏకపక్షం చేసుకోవాలని ప్రణాళిక వేశారని జోరుగా వినిపిస్తోంది. ఈ పరిణామాల క్రమంలో జిల్లా అధికార యంత్రాంగం సైదాపురం ఎంపీపీ పీఠం ఎంపిక సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. అలాగే ప్రస్తుతం సైదాపురం ఎన్నికల అధికారిగా నియమించిన రాపూరు ఎన్నికల అధికారిపై మరోసారి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసేందుకు వైఎస్సార్‌సీపీ రంగం సిద్ధం చేసుకుంటోంది.


