● ఏహెచ్ ఏడీ
డాక్టర్ చైతన్యకిషోర్
నెల్లూరు(వేదాయపాళెం): ‘ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పశువులకు త్వరగా సోకే గొంతువాపు వ్యాధి పట్ల పాడిరైతులు, పశుపోషకులు అప్రమత్తంగా ఉండాలి. ముందస్తుగా టీకాలు వేయించడం ద్వారా జీవాలకు రక్షణ లభిస్తుంది’ అని పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జె.చైతన్యకిషోర్ సూచించారు. ఆదివారం ఆయన నెల్లూరులోని కార్యాలయంలో మాట్లాడుతూ ఈ వ్యాధి సోకిన పశువులు 12 నుంచి 24 గంటల్లోనే మరణించే ప్రమాదం ఉందన్నారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. మంచుతో తడిసిన పచ్చిగడ్డి తినడం వల్ల బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉందన్నారు. పశువులను కొట్టాల్లో కాకుండా ఆరుబయట కట్టేయడం, రాత్రివేళ చల్లటి గాలికి గురికావడం కూడా వ్యాధి వ్యాప్తికి కారణమవుతాయని వివరించారు. పశువులను వాహనాల్లో తరచూ తరలించకుండా, ఒత్తిడికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆరు నుంచి 18 నెలల వయసున్న వాటికి ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. దవడ కింది భాగం వాపు, తీవ్రమైన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అధికంగా గురక పెట్టడం ఈ వ్యాధి ప్రధాన లక్షణాలని తెలిపారు. రైతులు దీనిని పచ్చికదొమ్మ, గొంతువాపు, గురక వ్యాధిగా పిలుస్తారన్నారు. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం పశువులకు హెచ్‌ఎస్ వ్యాక్సిన్‌ను ఉచితంగా రైతుల ఇళ్ల వద్దకే వెళ్లి వేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం జిల్లాలో 2,56,250 డోసులు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రభుత్వం ప్రతి ఏడాది జూన్, జులైతోపాటు అక్టోబర్, నవంబర్ నెలల్లో టీకాల కార్యక్రమం నిర్వహిస్తుందని, పాడిరైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


