● మేకపాటి విక్రమ్‌రెడ్డి
ఆత్మకూరు: ‘మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్ల విషయంలో అధికార పార్టీ దాష్టీకాలకు అధికారులు వత్తాసు పలికారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ఇలాంటివి పునరావృతం కాకుండా బాధ్యతగా వ్యవహరించాలి’ అని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. చేజర్ల మండలంలో వారం రోజుల క్రితం ఆర్‌ఓలుగా ప్రకటించిన ప్రధానోపాధ్యాయులను తొలగించి వారి స్థానంలో రెవెన్యూ, రీసర్వే సిబ్బందితో పాటు ఇతర శాఖల అధికారులను నియమించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. స్టేజ్ – 1 స్థాయి అధికారి ఎంఈఓ స్థాయిలో ఉండాలని, అలా కాకుండా కింది స్థాయి ఉద్యోగులను పెట్టి ప్రతిపక్షం బలపరిచిన అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేస్తారని అనుమానం వ్యక్తం చేశారు. తమ పార్టీ బలపరిచిన అభ్యర్థుల నామినేషన్లను స్క్రూట్నీ పేరుతో గతంలోలా తిరస్కరించాలని చూస్తే మాత్రం ఈసారి సహించేదిలేదని హెచ్చరించారు. చేజర్ల మండలంలో 6వ తేదీ నాటికి మొత్తం 26 పంచాయతీలకు ఆర్‌ఓలుగా పలు పాఠశాలల హెచ్‌ఎంలను నియమించి శిక్షణ సైతం పూర్తి చేశారన్నారు. అయితే 10వ తేదీ మండలంలోని 13 పంచాయతీలకు ఆర్‌ఓలను మార్చి చిన్న స్థాయి అధికారులను నియమించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కలెక్టర్, ఆర్డీఓ సమాధానం చెప్పాలన్నారు.


