● పెళ్లకూరు జెడ్పీటీసీ
కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి
● అక్రమ కేసులో జైలు నుంచి
విడుదల
నెల్లూరురూరల్: ‘ప్రజాభిమానం ముందు ఎన్ని కుట్రలు, కేసులు, అడ్డంకులు సృష్టించినా నిలబడవు. నాపై అక్రమంగా 19 కేసులు పెట్టి 180 రోజులపాటు జైల్లో పెట్టారు. అయినా జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి 1,719 ఓట్ల మెజారిటీతో విజయం సాధించా. ఇది ప్రజాభిమానానికి నిదర్శనం’ అని పెళ్లకూరు నూతన జెడ్పీటీసీ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి తెలిపారు. గురువారం నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలైన ఆయన వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం కామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయ కక్షతో తనపై వరుసగా కేసులు నమోదు చేస్తూ వేధింపులకు గురిచేసిందని చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే సంబంధం లేని గొడవలో సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసి 20 రోజులపాటు రిమాండ్‌కు పంపించారని వివరించారు. కలవకూరు వద్ద అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకున్నందుకు కేసులు పెట్టారని, మూడేళ్ల క్రితం జరిగిన ఘటనకు సంబంధించి కిడ్నాప్ కేసు నమోదు చేశారని తెలిపారు. చివరికి ఓ మృతదేహాన్ని తీసుకొచ్చి తనపై హత్య కేసు నమోదు చేసి, మరో ఏడుగురిని జైలుకు పంపించారని పేర్కొన్నారు. ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా, ఒక్క మద్యం బాటిల్ పంపిణీ చేయకుండా 1,719 ఓట్ల మెజారిటీ సాధించామని తెలిపారు. 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో అవినీతి మరక లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయడమే ఈ ఆదరణకు కారణమన్నారు.
జగన్ స్ఫూర్తితోనే పోరాటం
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్ఫూర్తితోనే వెనుకడుగు వేయకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం కొనసాగించామని కామిరెడ్డి తెలిపారు. కుటుంబ సభ్యులు చూపిన ధైర్యం, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందించిన సహకారం మరువలేనిదని, వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నామినేషన్ల సమయంలో ఎనిమిది మంది ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను కొందరు చించివేశారని, ఆ సమయంలో పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదన్నారు. ఎన్నో అవరోధాలు ఎదురైనా ఎన్నికల్లో ధైర్యంగా నిలబడి రెండు ఎంపీటీసీ స్థానాల్లోనూ విజయం సాధించామని చెప్పారు. పెళ్లకూరు మండల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు.


