గమ్యం చేరకుండానే.. అనంతలోకాలకు.. | - | Sakshi
Sakshi News home page

గమ్యం చేరకుండానే.. అనంతలోకాలకు..

Nov 14 2026 7:45 AM | Updated on Nov 14 2026 7:45 AM

● వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో

నలుగురి మృతి

కొందరి ప్రయాణం విషాదంగా మారింది. జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో

జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు మృతిచెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది.

లారీని ఢీకొన్న సిమెంట్‌ ట్యాంకర్‌

ఆత్మకూరు: పోర్టు నుంచి సిమెంట్‌ లోడ్‌తో బళ్లారికి వెళ్తున్న బల్కర్‌ (ట్యాంకర్‌), మరో లారీని ఢీకొట్టింది. దీంతో బల్కర్‌ డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. మరో డ్రైవర్‌ గాయపడ్డాడు. ఈ విషాద ఘటన ఆత్మకూరు పరిధిలోని వెంకట్రావుపల్లి సమీపంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్సై జంపానికుమార్‌ కథనం మేరకు.. కృష్ణపట్నం పోర్టు నుంచి సిమెంట్‌ లోడ్‌ చేసుకుని బళ్లారికి మధ్యప్రదేశ్‌కు చెందిన బల్కర్‌ నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై వేగంగా వెళ్తోంది. ఈ క్రమంలో వైఎస్సార్‌ కడప నుంచి నెల్లూరుకు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బల్కర్‌ డ్రైవర్‌ మధ్యప్రదేశ్‌కు చెందిన మహమ్మద్‌ అలి (42) ప్రాణాలు కోల్పోయాడు. మరో లారీ డ్రైవర్‌ గాయపడటంతో అతడిని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదం అనంతరం బల్కర్‌ రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో రహదారిపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. గంటన్నరపాటు ట్రాఫిక్‌ స్తంభించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న ఎస్సై సిబ్బందితో కలిసి ప్రమాదానికి గురైన వాహనాలను రహదారిపై నుంచి పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఇంటికెళ్తూ..

రాపూరు: మండలంలోని బండేపల్లిసమీపంలో జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. బండేపల్లికి చెందిన బొమ్మనుపోయిన గంగయ్య (62), వామిటిపర్తి పిచ్చయ్య (60) కూలి పనులు ముగించుకుని ఇంటికి నడిచి వెళ్తున్నారు. ఈ సమయంలో తిరుపతి నుంచి రాపూరు వైపు వెళ్తున్న కారు బండేపల్లి వద్ద వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఇద్దరికీ తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు చనిపోవడంతో విషాదం నెలకొంది. పోలీసుల కేసు నమోదు చేశారు.

ట్రాక్టర్‌ ఢీకొని..

కావలి: జాతీయ రహదారిపై గురువారం బైక్‌ను ట్రాక్టర్‌ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. కొండాపురం మండలం కొమ్మి గ్రామానికి చెందిన నరేష్‌బాబు (25) కావలి నుంచి గౌరవరానికి బైక్‌పై వెళ్తున్నాడు. అదే సమయంలో గౌరవరం నుంచి కావలి వైపు వస్తున్న ట్రాక్టర్‌ బైక్‌ను ఢీకొట్టింది. నరేష్‌ను చికిత్స నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించే క్రమంలో చనిపోయాడు. రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement