● రోడ్డుపై కంప వేసి
ఏరూరు వాసుల నిరసన
● స్పందించని అధికారులు
చిల్లకూరు: కూటమి ప్రభుత్వ తీరుపై చిల్లకూరు మండలం ఏరూరు గ్రామ ప్రజలు మండిపడుతున్నారు. మూడు రోజులుగా తమ సమస్యను తెలియజేస్తున్నా కనీసం ఒక్క అధికారి కూడా గ్రామానికి వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులను పంపి ఇళ్లకు వెళ్లాలని బలవంతం చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. మండలంలోని తీర ప్రాంత గ్రామమైన ఏరూరులో సుమారు ఒకటిన్నర కిలోమీటరు మేర ప్రధాన రహదారి భారీ వాహనాల రాకపోకలతో పూర్తిగా దెబ్బతింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు మూడు రోజుల క్రితం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. రెండో రోజు రోడ్డుపై పేరుకుపోయిన బురదలో వరి నాట్లు వేసి వినూత్నంగా నిరసన తెలిపారు. వాహనాలను అడ్డుకోవడంతోపాటు కోట, గూడూరు డిపోల నుంచి రాకపోకలు సాగించే బస్సులను వెనక్కి పంపినా ఒక్క అధికారి కూడా స్పందించలేదు. దీంతో గురువారం స్థానికులు రోడ్డుపైనే టెంట్ వేసుకుని నిరసన కొనసాగించడంతోపాటు రోడ్డుకు అడ్డంగా కంప వేశారు. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిరసన విరమించాలని గ్రామస్తులకు సూచించారు. అయితే అధికారుల నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు తమ పోరాటం ఆగదని వారు తేల్చిచెప్పారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన నాయకులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన వచ్చే అవకాశం లేదని, ఎన్నికల అనంతరం అధికారులతో చర్చించి రహదారికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ, తమకు స్పష్టమైన హామీ లభించే వరకు నిరసన విరమించేది లేదని గ్రామస్తులు స్పష్టం చేశారు.


