● వీఎస్‌యూ వీసీ అల్లం శ్రీనివాసరావు
వెంకటాచలం: విద్యార్థులు చదువుతోపాటు తమ ఆలోచనా విధానంలోనూ మార్పు తెచ్చుకోవాలని విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్‌యూ) వీసీ అల్లం శ్రీనివాసరావు సూచించారు. మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న వర్సిటీలో గురువారం మేథో సంపత్తి హక్కులు, వ్యవస్థాపకతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం – 2020 విద్యావ్యవస్థలో నూతన మార్పులకు దోహదపడుతోందన్నారు. విద్యార్థులు చదువుతోపాటు నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా, ఇతరులకు ఉద్యోగావకాశాలు కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. దేశ ఆర్థికాభివృద్ధిలో వ్యవస్థాపకత కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు విద్యార్థులు, పరిశోధకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్వయం ఉపాధి, నూతన వ్యాపార అవకాశాలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు జీఎఎంపీ పథకం ద్వారా లభించే ప్రభుత్వ సహాయంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మేథో సంపత్తి అధికారి ఎస్.శ్రీనివాస్, వీఎస్‌యూ కళాశాల ప్రిన్సిపల్ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


