నెల్లూరు(క్రైమ్): ఏం కష్టమొచ్చిందో తెలియదు గానీ గూడ్స్ రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నెల్లూరు సౌత్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారం నంబర్ మూడు చివరన గురువారం చోటుచేసుకుంది. మృతుడి వయసు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. 5.6 అడుగుల ఎత్తు ఉన్నాడు. లేత బులుగు రంగు, తెలుపు రంగులు గల గీతల ఫుల్‌హ్యాండ్స్ చొక్కా, బులుగు రంగు జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. మృతుడి ఎడమ చేతిపై స్వప్న అని పచ్చబొట్టు ఉంది. సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు నెల్లూరు రైల్వే పోలీసులకు, 92475 75628 ఫోన్ నంబర్‌కు తెలియజేయాలని ఎస్సై కోరారు.
కండలేరులో 16.645 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో గురువారం నాటికి 16.645 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 70, లోలెవల్ కాలువకు 10, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 7 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.


