పురపోరుకు షెడ్యూల్‌ విడుదల | - | Sakshi
Sakshi News home page

పురపోరుకు షెడ్యూల్‌ విడుదల

Nov 14 2026 12:29 AM | Updated on Nov 14 2026 12:29 AM

నెల్లూరు రూరల్‌: కావలి, గూడూరు మున్సిపాల్టీలు, అల్లూరు నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదలైందని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావలిలో 44.. గూడూరులో 48.. అల్లూరులో 23 వార్డులకు ఎలక్షన్లను నిర్వహించనున్నారని చెప్పారు. శనివారం నుంచి సోమవారం వరకు నామినేషన్ల స్వీకరణ.. 17న పరిశీలన.. 19న ఉపసంహరణకు అవకాశముంటుందని పేర్కొన్నారు. 26న ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు వరకు పోలింగ్‌ను నిర్వహించి 30న కౌంటింగ్‌ను జరపనున్నారని వెల్లడించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చిందని.. నిబంధనలను రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పాటించాలని కోరారు.

నేడూ పనిచేయనున్న

రిజిస్ట్రార్‌ కార్యాలయాలు

నెల్లూరు సిటీ: జిల్లాలోని రిజిస్ట్రార్‌ కార్యాలయాలు శనివారం సైతం పనిచేయనున్నాయని జిల్లా రిజిస్ట్రార్‌ రవి జోసఫ్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ విజయరాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థిరాస్తుల క్రయవిక్రయాలు చేయాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

వెబ్‌సైట్‌లో తాత్కాలిక సీనియార్టీ జాబితా

నెల్లూరు (టౌన్‌): ఉమ్మడి జిల్లా కేడర్లకు ఉద్యోగుల కేటాయింపు నిమిత్తం ఉపాధ్యాయులు, సిబ్బంది తాత్కాలిక సీనియార్టీ జాబితాను deonellore.50webs.comలో ఉంచామని డీఈఓ బాలాజీరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏమైనా అభ్యంతరాలు, సవరణలు లేదా మార్పులుంటే తగిన ధ్రువీకరణ పత్రాలతో సంబంధిత డీడీఓ ద్వారా డీఈఓ కార్యాలయంలో ఈ నెల 17వ తేదీ సాయంత్రం ఐదులోపు సమర్పించాలని సూచించారు.

ఎల్‌ఎల్‌బీ పరీక్షలకు

87 మంది గైర్హాజరు

వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ కళాశాలల్లో శుక్రవారం నిర్వహించిన ఎల్‌ఎల్‌బీ పరీక్షలకు 87 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని వీఎస్‌యూ పరీక్షల నిర్వహణాధికారి మధుమతి తెలిపారు. ఉదయం నిర్వహించిన పరీక్షకు 463 మందికి గానూ 411 మంది హాజరయ్యారని వివరించారు. మధ్యాహ్నం నిర్వహించిన ఎగ్జామ్‌కు 429 మందికి గానూ 35 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.

శ్రీవారి దర్శనానికి ఎనిమిది గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవారం అధికంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయి.. శిలాతోరణం వద్దకు క్యూ చేరుకుంది. స్వామివారిని 70,460 మంది గురువారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 27,318 మంది అర్పించారు. శ్రీవారి హుండీలో రికార్డు స్థాయిలో రూ.5.02 కోట్లను సమర్పించారు. టైమ్‌ స్లాట్‌ టికెట్లున్న వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.

12న జాతీయ లోక్‌ అదాలత్‌

నెల్లూరు (లీగల్‌): జాతీయ లోక్‌ అదాలత్‌ను డిసెంబర్‌ 12న నిర్వహించనున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ నరసింహమూర్తి పేర్కొన్నారు. నగరంలోని జిల్లా కోర్టు హాల్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైకోర్టు, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు నెల్లూరు, కోవూరు కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, గూడూరు, కోట, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట కోర్టుల్లో లోక్‌ అదాలత్‌ను నిర్వహించనున్నామని తెలిపారు. సివిల్‌, క్రిమినల్‌, చెక్కు బౌన్స్‌, కుటుంబ తగాదాలు, మోటార్‌ యాక్సిడెంట్లు తదితర కేసులను పరిష్కరించనున్నామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి పద్మశ్రీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement