● న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నాం
● వీరోచితంగా పోరాడిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
పొదలకూరు: పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల్లో ఫలితాలను తారుమారు చేశారని.. పంచాయతీ ఎన్నికల నిర్వహణలోనూ అదే తీరును అవలంబించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో శుక్రవారం ఆయన మాట్లాడారు. పంచాయతీల్లో కూటమి పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. తానేదో విజయం సాధించాననే రీతిలో సంబరాలను సోమిరెడ్డి జరుపుకొంటున్నారని, అయితే పరిషత్ ఎన్నికల్లో టీడీపీ గ్రాఫ్ పడిపోయిన అంశాన్ని గుర్తుచేశారు. తమ ప్రభుత్వ హయాంలో సర్వేపల్లి నియోజకవర్గంలో రెండు ఎంపీటీసీ స్థానాల్లోనే టీడీపీ విజయం సాధించిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే ప్రస్తుతం 79 ఎంపీటీసీలు, ఐదు జెడ్పీటీసీ స్థానాల్లో అభ్యర్థులను నిలిపి మూడో వంతు చోట్ల విజయాన్ని సాధించామని తెలిపారు. బైండోవర్ కేసులు, దౌర్జన్యాలు, బెదిరింపులకు వెరవకుండా ఎన్నికల్లో తమ పార్టీ శ్రేణులు ధైర్యంగా పాల్గొన్నారని అభినందించారు. రాజకీయ పార్టీల గుర్తులుండని పంచాయతీ ఎన్నికల్లో తమ మద్దతుతో గెలుపొందిన విజేతలను సైతం టీడీపీ వారి ఖాతాలో వేసుకుంటుందని విమర్శించారు.
పరిషత్ ఫలితాలపై న్యాయపోరాటం
ముత్తుకూరు, పొదలకూరు జెడ్పీటీసీ స్థానాల కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. కౌంటింగ్‌లో పాల్గొన్న అధికారుల సమాధానాలే దీనికి నిదర్శనంగా ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై న్యాయపోరాటాన్ని చేయనున్నామని ప్రకటించారు. టేబుల్ వారీగా వచ్చిన ఓట్ల వివరాలను తమకు చూపాలని ఏజెంట్లు కోరినా, ఆర్వోలు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఆరు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యాక, తప్పుడు లెక్కలతో వివరాలను వెల్లడించారని మండిపడ్డారు. ఒక టేబుల్‌పై తమ పార్టీకి అధిక ఓట్లొస్తే, వాటిని టీడీపీ ఖాతాలో వేశారని విమర్శించారు. పొదలకూరు జెడ్పీటీసీ స్థానం కౌంటింగ్ ముగియక ముందే 46 ఓట్లతో టీడీపీ గెలిచిందంటూ ప్రకటించారని ధ్వజమెత్తారు. ముత్తుకూరులో కౌంటింగ్‌లో పాల్గొన్న అధికారులతో తాను మాట్లాడిన సమయంలో, పొరపాట్లు జరిగాయని అంగీకరించారని చెప్పారు. పైనాపురం, దొరువుపాళెం ఫలితాలనూ తారుమారు చేశారని ఆరోపించారు. అనంతరం పరిషత్ ఎన్నికల్లో పోరాడి గెలిచిన, ఓడిన అభ్యర్థులను అభినందించారు. ఇదే స్ఫూర్తితో పంచాయతీ ఎన్నికల్లోనూ పోరాడి విజయం సాధించాలని పిలుపునిచ్చారు. నేతలు పెదమల్లు రమణారెడ్డి, గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, కోనం చినబ్రహ్మయ్య, బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, తెనాలి నిర్మలమ్మ, లక్ష్మీకల్యాణి, వూకోటి లక్ష్మీనారాయణ, ఎంపీటీసీలు వాకాటి సంధ్య, వాణి, ఉషా, బండి చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.


