‘మధుమేహం’ సైలెంట్‌ కిల్లర్‌ | - | Sakshi
Sakshi News home page

‘మధుమేహం’ సైలెంట్‌ కిల్లర్‌

Nov 14 2026 12:29 AM | Updated on Nov 14 2026 12:29 AM

నెల్లూరు(అర్బన్‌): మధుమేహం.. షుగర్‌.. డయాబెటిస్‌.. పేరు ఏదైనా వ్యాధి ఒక్కటే. ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలో ఎక్కువగా కనిపించే మధుమేహం ఇప్పుడు యువతను కూడా వేధిస్తోంది. వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌, కిడ్నీ సమస్యలు, చూపు కోల్పోవడం వంటి తీవ్ర పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏటా నవంబర్‌ 14వ తేదీన ప్రపంచ మధుమేహ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు.

జిల్లాలో ఇదీ పరిస్థితి

జిల్లాలో ఆరు లక్షల మందికిపైగా మధుమేహంతో బాధపడుతున్నట్లు అంచనా. ప్రతి నలుగురిలో ఒకరికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. అధిక పని ఒత్తిడి, శారీరక శ్రమ తగ్గడం, జంక్‌ఫుడ్‌, ప్రాసెస్‌ చేసిన ఆహార పదార్థాల వినియోగం, ఊబకాయం తదితర అంశాలు మధుమేహానికి దారితీస్తున్నాయి. వంశపారంపర్య కారణాలు కూడా ప్రభావం చూపుతాయి. క్లోమగ్రంథి నుంచి ఇన్సులిన్‌ ఉత్పత్తి తగినంతగా లేకపోవడం లేదా శరీరం ఇన్సులిన్‌ను సరిగా వినియోగించుకోలేకపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. పెద్దల్లో టైప్‌ 1 షుగర్‌ వస్తుంటే.. చిన్నపిల్లల్లో టైప్‌ 2 వ్యాధి వస్తోంది. జిల్లాలో 20 వేల మందికిపైగా పిల్లల్లో టైప్‌ 2 వ్యాధి ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

నిర్లక్ష్యం చేస్తే ముప్పు

మధుమేహం నియంత్రణలో లేకపోతే రక్తనాళాలు దెబ్బతిని గుండెపోటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కిడ్నీలు, కళ్లపై కూడా ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కంటిలోని రెటీనాకు నష్టం కలిగి చూపు మందగించడం, ఒక్కోసారి చూపు కోల్పోవడం జరగవచ్చు. నరాలు దెబ్బతినడం వల్ల కాళ్లలో స్పర్శ తగ్గడం, గాయాలు త్వరగా మానకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

లక్షణాలు గుర్తించాలి

తరచూ ఆకలి, దాహం వేయడం, ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లడం, నీరసం, కారణం లేకుండా బరువు తగ్గడం, గాయాలు త్వరగా మానకపోవడం, చూపు మందగించడం వంటివి మధుమేహ లక్షణాలు. వీటిని గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.

జీవనశైలిలో మార్పులు అవసరం

మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలంటే రోజువారీ జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. క్రమం తప్పకుండా నడక, వ్యాయామం, యోగా చేయాలి. ఆకుకూరలు, కాయగూరలు, పీచు పదార్థాలు, మాంసకృత్తులు ఉన్న సమతుల ఆహారం తీసుకోవాలి. తీపి పానీయాలు, జంక్‌ఫుడ్‌, అధికంగా శుద్ధి చేసిన పిండి పదార్థాలకు దూరంగా ఉండాలి. వైద్యుల సూచన మేరకు మందులు క్రమం తప్పకుండా వాడుతూ, రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించుకోవాలి.

నిర్లక్ష్యం చేస్తే గుండె, మెదడుపై

తీవ్ర ప్రభావం

జిల్లాలో ఆరు లక్షల మందికిపైగా

బాధితులు

జీవనశైలి మార్పులతోనే వ్యాధి నియంత్రణ

వరల్డ్‌ డయాబెటిస్‌ డే నేడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement