నెల్లూరురూరల్: వైఎస్సార్‌సీపీ జంగమ విభాగం జిల్లా అధ్యక్షుడిగా నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన సీహెచ్ హరిని నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం కేంద్ర కార్యాలయం నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి.
పట్టాలు దాటుతుండగా..
● రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్లో గురువారం రాత్రి ఓ వ్యక్తి పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన అతను జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. అతని వయసు 55 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. గులాబీ, బులుగు రంగుల గీతలు కలిగిన ఫుల్ హాండ్స్ చొక్కా, మెరూన్ కలర్ షార్ట్ ధరించి ఉన్నాడు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై ఎన్.హరిచందన హాస్పిటల్‌కు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసినవారు రైల్వే పోలీసులను సంప్రదించాలని ఎస్సై కోరారు.
ఇద్దరు రౌడీషీటర్లపై
పిట్ ఎన్‌డీపీఎస్ యాక్ట్
నెల్లూరు(క్రైమ్): ఇద్దరు రౌడీషీటర్లపై పోలీసులు పిట్ ఎన్‌డీపీఎస్ యాక్ట్ ప్రయోగించారు. దర్గామిట్ట ఇన్‌స్పెక్టర్ కల్యాణరాజు కథనం మేరకు.. ప్రగతి నగర్‌కు చెందిన షేక్ ముక్తియార్‌పై దర్గామిట్ట పోలీసుస్టేషన్‌లో, టెక్కెమిట్టకు చెంది ప్రస్తుతం కొండాయపాళెంలో ఉంటున్న ఎం.ప్రవీణ్‌పై వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్లు ఉన్నాయి. వీరిద్దరూ గంజాయి విక్రయాలకు పాల్పడడంతోపాటు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారని, శుక్రవారం ఇద్దరిపై పిట్ ఎన్‌డీపీఎస్ యాక్ట్ ప్రయోగించి కడప కేంద్ర కారాగారానికి తరలించినట్లుగా ఇన్‌స్పెక్టర్ వెల్లడించారు.
అసభ్యకర వ్యాఖ్యలపై
పోలీసులకు ఫిర్యాదు
నెల్లూరు(క్రైమ్): సోషల్ మీడియాలో మహిళలపై అసభ్య వ్యాఖ్యలు, వ్యక్తిత్వ హసనానికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని నెల్లూరు 53వ డివిజన్ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి బాబీ భగత్ కోరారు. శుక్రవారం ఆయన చిన్నబజారు ఇన్‌స్పెక్టర్ సీహెచ్ సీతారామయ్యకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా భగత్ మాట్లాడుతూ కొందరు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డి, సోదరి వైఎస్ షర్మిలారెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే వారి వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగిస్తున్నారన్నారు. అదేక్రమంలో వైఎస్సార్‌సీపీ మహిళా నాయకులు, కార్యకర్తలనూ లక్ష్యంగా చేసుకుని దూషణలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇలాంటి సోషల్ మీడియా ఖాతాదారులను గుర్తించి, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
కండలేరులో
16.636 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 16.636 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 70, లోలెవల్ కాలువకు 10, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 7 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.75
సన్నవి : రూ.40
పండ్లు : రూ.15


