నారుమళ్లు వేసుకోవద్దు : ఎస్‌ఈ | - | Sakshi
Sakshi News home page

నారుమళ్లు వేసుకోవద్దు : ఎస్‌ఈ

Nov 14 2026 12:29 AM | Updated on Nov 14 2026 12:29 AM

నెల్లూరు(వేదాయపాళెం): జిల్లాలోని రైతాంగం బోర్లను నమ్ముకుని తొందరపడి రబీ సాగుకు నారుమళ్లు వేసుకోవద్దని జిల్లా ఇరిగేషన్‌ సర్కిల్‌ ఎస్‌ఈ దేశ్‌నాయక్‌ సూచించారు. శుక్రవారం ఆయన నెల్లూరులో మాట్లాడుతూ సోమశిల జలాశయంలో ప్రస్తుతం 19.82 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉందన్నారు. 15 టీఎంసీలు డెడ్‌ స్టోరేజీ, తాగునీటి, ఇతర ముఖ్యమైన, అత్యవసర అవసరాలకు వినియోగించుకోవాల్సి ఉంటుందన్నారు. మిగిలిన 4.82 టీఎంసీల నీటిలో 15 శాతం వేస్టేజీ తదితర కారణాలతో పరిగణనలోకి తీసుకోలేమన్నారు. మిగిలిన కొద్దిపాటి నీటితో పెన్నా డెల్టా ఆయకట్టుకు ప్రస్తుత పరిస్థితుల్లో సాగునీరు అందించలేమని తెలిపారు. ఎల్‌నినో పరిస్థితుల ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటితే అధికనీరు అవసరమైన సమయంలో అందించలేక పంట నష్టపోయే ప్రమాదముందన్నారు. పెన్నా డెల్టా ఆయకట్టుకు సాగునీరు అందించాలంటే సోమశిలలో కనీసం 40 టీఎంసీల నీరు నిల్వ ఉండాలన్నారు. అందువల్ల రైతులు రబీ నారుమళ్లు ఇప్పుడే పోసుకోవద్దని తెలిపారు. నీటి నిల్వలు, ఇతర వనరులు, పరిస్థితుల ఆధారంగా నారుమళ్లకు అనువైన సమయాన్ని తామే సూచిస్తామని పేర్కొన్నారు.

డైట్‌లో బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీలు

ఇందుకూరుపేట: బాలల్లో శాసీ్త్రయ ఆలోచనా దృక్పథాన్ని, పరిశోధనా నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో 32వ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ జిల్లా స్థాయి శాసీ్త్రయ ప్రాజెక్ట్‌ల పోటీలు శుక్రవారం మండలంలోని పల్లెపాడులో ఉన్న ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్‌)లో జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి ఆధ్వర్యంలో, పాఠశాల విద్యాశాఖ సహకారంతో జరిగిన ఈ పోటీలకు కేంద్ర శాస్త్ర సాంకేతిక మండలి నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరించింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 173 పరిశోధనలు నమోదుకాగా, వాటిలో 131 పరిశోధనలకు సంబంధించిన ప్రాజెక్ట్‌లను విద్యార్థులు ప్రదర్శించారు. ముఖ్యఅతిథిగా హాజరైన డీఈఓ ఆర్‌.బాలాజీరావు మాట్లాడుతూ నూతన శాస్త్ర, సాంకేతిక కార్యక్రమాలపై తల్లిదండ్రులు, విద్యార్థులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలన్నారు. ఏడు ప్రాజెక్ట్‌లను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు వెల్లడించారు. అనంతరం కందుకూరు సీకే దాస్‌ అకాడమీ చారిటబుల్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ప్రతిభ చూపిన బాల శాస్త్రవేత్తలతోపాటు వారికి మార్గదర్శకత్వం వహించిన టీచర్లకు నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఏడు ప్రాజెక్ట్‌లు డిసెంబర్‌ మొదటి వారంలో విజయవాడలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయన్నారు. కార్యక్రమంలో డైట్‌ ఇన్‌చార్జి ప్రధానాచార్యులు వి.అక్కిరెడ్డి, జిల్లా సమన్వయకర్త జె.వెంకటరమేష్‌, జిల్లా విద్యా సమన్వయకర్త సీహెచ్‌ మారుతి కేశవకుమార్‌, జిల్లా సైన్స్‌ అధికారి కేవీఆర్‌ మూర్తి, డైట్‌ సీనియర్‌ ఉపన్యాసకులు తదితరులు పాల్గొన్నారు.

బైక్‌ను ఢీకొట్టిన కారు

● పోలీసులకు గాయాలు

దుత్తలూరు(ఉదయగిరి): మండలంలోని నందిపాడు హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. విధి నిర్వహణలో భాగంగా మోటార్‌బైక్‌పై వెళ్తున్న దుత్తలూరు పోలీసులను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హెడ్‌ కానిస్టేబుల్‌ రాయుడు, హోంగార్డు శ్రీనుకు గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement