నెల్లూరు(క్రైమ్): త్వరలో జరిగే పుర, పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశించారు. శుక్రవారం నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్పీ నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 35 మండలాల పరిధిలో 700 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో, మూడు మున్సిపాల్టీల్లో జరిగే ఎన్నికల్లో సుమారు 14.72లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. పల్లెనిద్రలు, ఫ్లాగ్‌మార్చ్‌లు, కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు, నాకాబందీలు నిర్వహించాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను గుర్తించి ముందస్తు బైండోవర్‌లు చేయాలన్నారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయండంతో పాటు సాంకేతిక, శాసీ్త్రయ ఆధారాలు, సీసీ ఫుటేజ్‌లను సేకరించి నేర నిర్ధారణశాతాన్ని పెంచాలన్నారు. పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్‌చేయాలన్నారు. జిల్లా సైబర్ వింగ్ పనితీరును ఎస్పీ అభినందించారు. ఈ ఏడాది మే నుంచి ఎంఆర్‌ఎం (మనీ రిస్టోరేషన్ మాడ్యూల్) పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు 802 మంది సైబర్ నేర బాధితులకు రూ.63.17లక్షల నగదును తిరిగి అందించినట్లు వెల్లడించారు. సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడంతోపాటుగా బాధితులకు సకాలంలో సహాయం అందించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం చేయరాదన్నారు. ఆపరేషన్ త్రిశూల్ అమలుపై సమీక్షించారు. సమావేశంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నగర ఏఎస్పీ దీక్ష, డీఎస్పీలు, సీఐలు తదితరులు పాల్గొన్నారు.


