జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఇద్దరి ప్రాణాలు పోయాయి.
ట్రాక్టర్‌ను ఢీకొని..
కొండాపురం: ఓ ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా యువకుడి నిండు ప్రాణం పోయింది. మండలంలోని కొమ్మి గ్రామానికి చెందిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన కావలి మండలం గౌరవరం టోల్‌ప్లాజా సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కొమ్మికి చెందిన సత్తు నరేష్ (24) ఏడాదిగా కావలిలో అద్దె గదిలో ఉంటూ ఫ్లిప్‌కార్ట్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి గౌరవరం గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్తుండగా రాంగ్ రూట్లో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నరేష్‌ను స్థానికులు అంబులెన్స్‌లో కావలి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా, దారిలోనే మృతిచెందాడు. శుక్రవారం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
గుర్తుతెలియని వ్యక్తి
నెల్లూరు(క్రైమ్): లారీ ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన నెల్లూరులోని పాత చెక్‌పోస్ట్ జంక్షన్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సుమారు 55 నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న గుర్తుతెలియని వ్యక్తి శుక్రవారం పాత చెక్‌పోస్టు జంక్షన్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి వెంకటేశ్వరపురం వైపు వెళ్తున్న లారీ వేగంగా ఢీకొంది. దీంతో కిందపడిన వ్యక్తిపై లారీ చక్రాలు వెళ్లడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న నార్త్ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశామని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ డి.జగన్మోహన్రావు కోరారు.


