అభివృద్ధి ఇదేనా సారూ..? | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి ఇదేనా సారూ..?

Nov 11 2026 12:25 AM | Updated on Nov 11 2026 12:25 AM

చంద్రపడియ నుంచి దూబగుంట వరకు రూ.1.73 కోట్లు.. ఏఎస్‌పేట రోడ్డు నుంచి మహిమలూరు, రామస్వామిపల్లి మీదుగా వెంగంపల్లి వరకు రూ.నాలుగు కోట్లు.. ఆత్మకూరులోని అప్పారావుపాళెం రోడ్డు నుంచి నల్లపరెడ్డిపల్లె, మురుగళ్ల, కనుపూరుపల్లె వరకు రూ.3.3 కోట్లు.. చేజర్ల మండలంలోని వీసీరోడ్డు 12 / 0 నుంచి పెరుమాళ్లపాడు వరకు రూ.నాలుగు కోట్ల మేర పనులు ఆగిపోయాయి.

మర్రిపాడు మండలంలోని ఎన్‌హెచ్‌ – 565 నుంచి చాబోలు వరకు రూ.రెండు కోట్లు.. దుత్తలూరు మండలంలోని డీకేడీ రోడ్డు కిలోమీటర్‌ 322 / 9 నుంచి నర్రవాడ మీదుగా కొత్తపేట వరకు.. కలువాయి మండలంలోని వీఆర్‌పల్లి, పెంచలకోన ఆర్‌ అండ్‌ బీ రోడ్డు నుంచి మాదన్నగారిపల్లె ఎస్టీ కాలనీ వరకు రూ.64 లక్షలు.. ఇలా రూ.25 కోట్ల విలువైన వర్కులు అతీగతీ లేకుండా ఉన్నాయి.

మా ఊరు రోడ్లు బాగు చేయండయ్య

కూటమి నేతల ధనదాహానికి అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ప్రజలకు ఎంతో కీలకమైన రహదారి పనుల్లోనూ కమీషన్లకు కక్కుర్తి పడి.. తమ వాటా కోసం బెదిరింపుల పర్వానికి తెరలేపుతున్నారు. ఒకవేళ వీటిని ఇవ్వకపోతే కాంట్రాక్టర్లపై రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి పరిణామాలు నెలకొన్న తరుణంలో వర్కులు ముందకు సాగక.. ప్రజల కష్టాలు నానాటికీ ఎక్కువవుతున్నాయి. ఏదో చేస్తారని ఆశించి.. ఓట్లేసిన తమను ఇలా ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అభివృద్ధి తమతోనే సాధ్యమని కూటమి నేతలు ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో అదంతా వాస్తవ విరుద్ధంగా ఉంటోంది. మంజూరైన పనులకు సైతం అడుగడుగునా అడ్డంకులను సృష్టిస్తూ.. ప్రజలకు కష్టాలను మిగిలిస్తున్నారు. కమీషన్ల పేచీ తెగకపోవడంతో రూ.25 కోట్ల రహదారుల పనులకు గ్రహణం పట్టింది. ఈ వర్కుల్లో తనకు పది శాతం కమీషన్‌ కావాలని ఆత్మకూరులోని ఒక ముఖ్యనేత పట్టుబట్టడమే దీనికి ప్రధాన కారణమవుతోంది. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలను కల్పించాల్సిన పాలకులు.. తమ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం అభివృద్ధిని పణంగా పెడుతున్నారనే విమర్శలు ఆత్మకూరు నియోజకవర్గంలో వెల్లువెత్తుతున్నాయి.

ప్రజలు ఇబ్బంది పడితే మాకేంటి..?

గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం జిల్లాలో 39 రోడ్డు పనులను రూ.96 కోట్లను గతంలో మంజూరు చేశారు. ఆత్మకూరు నియోజకవర్గంలో రూ.25 కోట్ల రోడ్డు పనులను భవానీ కన్‌స్ట్రక్షన్స్‌ వారు దక్కించుకున్నారు. అదే విధంగా ఇతర చోట్ల వేరే వారు కాంట్రాక్టులను పొంది నిర్మాణాలను చేపట్టి, పూర్తి చేశారు. అయితే ఒక్క ఆత్మకూరులో మాత్రమే పనులకు గ్రహణం పట్టింది. ఓ ముఖ్యనేత అడ్డుపుల్లేసి, కమీషన్ల కోసం కాంట్రాక్టర్లను వేధింపులకు గురిచేస్తున్నారు. ప్రజలు ఇబ్బందులు పడితే తనకేంటని.. తనకు కావాల్సిన మొత్తం దక్కితే చాలానే రీతిలో ఆయన వ్యవహరిస్తున్నారనే భావన స్థానికంగా వ్యక్తమవుతోంది.

తెగని పంచాయితీ

ఆత్మకూరు మినహా మిగిలిన ప్రాంతాల్లో రాజకీయ నాయకులకు మూడు శాతం కమీషన్లిచ్చేందుకు కాంట్రాక్టర్లు సిద్ధపడ్డారు. దీనికి వారు ఓకే అనడంతో సజావుగా సాగాయి. అయితే ఈ ఒక్కచోటే బేరసారాలు నేటికీ తెగలేదు. పది శాతం కావాలని సదరు నేత డిమాండ్‌ చేయగా, మూడు శాతాన్ని ఇవ్వగలమని కాంట్రాక్ట్‌ సంస్థ పేర్కొంది. అప్పటికీ తగ్గేదిలేదని చెప్పగా, నాలుగు శాతాన్ని ఇస్తామని తెలిపారు. అయి నా తొమ్మిది పర్సంట్‌ ఇవ్వకపోతే కుదరదని ఆయన చెప్పడంతో పనులు ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. ఫలితంగా ఆర్నెల్లుగా ఒక్క అడుకు ముందుకు పడలేదు. ఇంత జరుగుతున్నా, సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారులు పట్టించుకోకుండా.. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారు.

ఇదీ పరిస్థితి..

రూ.25 కోట్ల పనులకు ఆర్నెల్లుగా బ్రేక్‌

ఆత్మకూరులో కీలక నేత అడ్డుపుల్ల

కాంట్రాక్టర్లకు రాజకీయ వేధింపులు

ప్రజలకు రహదారి కష్టాలు

ఇదేనా కూటమి ప్రభుత్వ అభివృద్ధి..?

రాష్ట్రంలో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయని ప్రభుత్వం ఊకదంపుడు ప్రచారం చేసుకుంటోంది. అయితే ఉన్న రోడ్లను ధ్వంసం చేసి కొత్తగా వేయకపోవడమేనా అభివృద్ధని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఫైళ్లు ఆర్నెల్లుగా ఎక్కడ ఆగిపోయాయి.. పనులకు అడ్డుపడుతోందెవరు.. కమీషన్ల ఆరోపణలపై విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందానని పలువురు నిలదీస్తున్నారు. ఆగిపోయిన పనులను సత్వరమే ప్రారంభించి తమ కష్టాలను తీర్చాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement