సాక్షి టాస్క్‌ఫోర్స్: పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అడుగడుగునా అక్రమాలు జరిగాయనే అంశంపై పలు అనుమానాలతో పాటు స్పష్టమైన ఆధారాలూ ఉన్నాయి. అర్ధరాత్రి దాటాక కౌంటింగ్ కేంద్రాల్లోకి టీడీపీ గూండాలు చొచ్చుకురావడం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు, నేతలు లేవనెత్తిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. ఈ పరిణామాలను పరిశీలిస్తే సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు, పొదలకూరు మండలాల కౌంటింగ్‌లో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయనే విషయం తేటతెల్లమవుతోంది. ఈ వ్యవహారంలో ఏ అంశాన్నీ వదలకుండా ఆధారాలతో సహా సేకరించి న్యాయస్థానాన్ని ఆశ్రయించే పనిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలున్నారు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించిన ఏ అధికారినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు.
రిజల్ట్‌నే మార్చారు..
ముత్తుకూరు జెడ్పీటీసీతో పాటు దొరువులపాళెం, పైనాపురం, ముత్తుకూరు – 3 ఎంపీటీసీ స్థానాల ఫలితాలు తారుమారయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి నెల్లూరు పరిమళ దాదాపు 500 ఓట్లతో గెలిచారని అధికారులు తొలుత ప్రకటించారు. ఆపై అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఫలితాన్ని మార్చి అధికార పార్టీ అభ్యర్థి 57 ఓట్లతో విజయం సాధించారని ప్రకటించారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు, అభ్యర్థి సమ్మతించకుండా పెద్ద ఎత్తున ఆందోళనను చేపట్టేందుకు యత్నించారు. ఈ తరుణంలో టీడీపీ గూండాలు కౌంటింగ్ కేంద్రంలోకి చొచ్చుకొచ్చి, పోలీసుల సహకారంతో వ్యవహారాన్ని చక్కబెట్టారు. ఓట్లను తారుమారు చేయడంలో కౌంటింగ్ హాల్లో ఉన్న ఆర్వోతో పాటు తహసీల్దార్ సహకరించారనే ఆరోపణలున్నాయి.
అంతా గందరగోళం
u దొరువులపాళెం ఎంపీటీసీ స్థానంలో మూడు రౌండ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఆధిక్యం లభించింది. నాలుగో రౌండ్‌లో 500 ఓట్లను లెక్కించాల్సి ఉండగా, భోజనానికి వెళ్లాలని అధికారులు చెప్పి ఫలితాన్ని తారుమారు చేశారని అభ్యర్థి ఆరోపిస్తున్నారు.
u పైనాపురం ఎంపీటీసీ స్థానంలో తొలి రౌండ్‌లో పార్టీ అభ్యర్థికి 33 ఓట్ల ఆధిక్యం వచ్చింది. రెండో రౌండ్‌లో సమానంగా వచ్చాయని అధికారులు ప్రకటించారు. అయితే బ్యాలెట్ బాక్సులో అధికార పార్టీకి ఒక ఓటు ఉందంటూ ఆఫీసర్లు చెప్పి, టీడీపీ అభ్యర్థి గెలిచారని ప్రకటించారు. రీకౌంటింగ్‌కు పట్టుబట్టినా, పెడచెవిన పెట్టారు.
u ముత్తుకూరు మూడో సెగ్మెంట్ ఎంపీటీసీ స్థానంలోనూ ఇదే తరహాలో కట్టలు మార్చి లెక్కించారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే కౌంటింగ్ కేంద్రంలోకి బయటి వ్యక్తులు వచ్చిన విషయం బయటపడుతుంది.
సర్వేపల్లి లెక్కింపులో
తొత్తులుగా మారిన అధికారులు
కౌంటింగ్ కేంద్రంలోకి టీడీపీ గూండాలు
అధికారులు, పోలీసుల సహకారంతో ఫలితాలు తారుమారు
న్యాయస్థానాన్ని
ఆశ్రయించనున్న వైఎస్సార్సీపీ
జెడ్పీటీసీ కౌంటింగ్ తారుమారు
పొదలకూరు జెడ్పీటీసీ ఎన్నికల లెక్కింపులోనూ అక్రమాలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రతి రౌండ్‌లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లొచ్చాయో ప్రకటించాల్సిన అధికారులు, టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి 46 ఓట్లతో విజయం సాధించారని ప్రకటించారు. అన్ని రాజకీయ పార్టీల కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలను తీసుకోకుండా ఎన్నికల ఫలితాలను ప్రకటించడం ఇక్కడ గమనించాల్సిన అంశమని పేర్కొంటున్నారు. మొత్తం 42 రౌండ్లకు గానూ 22 రౌండ్ల వరకు ఏ పార్టీకి ఎన్ని ఓట్లు లభించాయో అధికారులు వెల్లడించలేదు. లెక్కింపును మందకొడిగా జరిపి అక్రమాలకు అవకాశం కల్పించారనే ఆరోపణలూ లేకపోలేదు.


