జనగణనలో తప్పులకు తావివ్వొద్దు | - | Sakshi
Sakshi News home page

జనగణనలో తప్పులకు తావివ్వొద్దు

Nov 11 2026 12:25 AM | Updated on Nov 11 2026 12:25 AM

● అధికారులకు కలెక్టర్‌ దిశానిర్దేశం

నెల్లూరు(బారకాసు): ‘జనగణనలో తప్పులకు తావివ్వొద్దు. నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో పక్కాగా సర్వే నిర్వహించాలి. వివరాలను కచ్చితత్వంతో నమోదు చేయాలి’ అని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ఆదేశించారు. నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో మంగళవారం జిల్లా సెన్సెస్‌ అధికారులు, మండల స్థాయి చార్జ్‌ ఆఫీసర్లు, అదనపు చార్జ్‌ ఆఫీసర్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లకు జనగణన – 2027పై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రశ్నావళిలోని 1 నుంచి 40 ప్రశ్నలపై సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని, ప్రతి ప్రశ్నకు ఒకే ప్రామాణిక విధానంలో సమాధానాలు నమోదు చేయాలని సూచించారు. సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌, ఇంటింటి సర్వే, రివిజనల్‌ రౌండ్‌లను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలన్నారు. రోజుకు సగటున నాలుగు నుంచి పది ఇళ్ల వివరాలను నమోదు చేయడం ద్వారా నిర్ణీత సమయంలో సర్వే పూర్తి చేయొచ్చన్నారు. 2027 జనవరి 10 నుంచి 24వ తేదీ వరకు సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ పోర్టల్లో వివరాల నమోదు, జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఇంటింటి సర్వే ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలన్నారు. సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌లో ఉద్యోగులు, పాఠశాలలు, కళాశాలలు, టిడ్కో గృహ సముదాయాలపై ప్రత్యేక దృష్టి సారించి క్లస్టర్ల వారీగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఒకసారి వివరాలను నమోదు చేసి సమర్పించిన తర్వాత సవరణలకు అవకాశం ఉండదని గుర్తుచేశారు. సేకరించిన సమాచారం ఆధారంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, భవిష్యత్‌ విధానపరమైన నిర్ణయాలు రూపుదిద్దుకుంటాయని తెలిపారు. డేటా కచ్చితత్వాన్ని నిర్ధారించేందుకు ప్రతి కార్యాలయంలో ప్రత్యేక డేటా వెరిఫికేషన్‌ సెల్‌ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురైతే తహసీల్దార్లు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో విజయ్‌కుమార్‌, అదనపు కమిషనర్‌ హిమబిందు, సీపీఓ లక్ష్మీనరసింహం తదితరులు పాల్గొన్నారు.

అధిక ధరలకు బియ్యం విక్రయిస్తే చర్యలు

● జాయింట్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు

నెల్లూరురూరల్‌: ‘అధిక ధరలకు బియ్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. సామాన్య, మధ్యతరగతి, పేద కుటుంబాలకు సరసమైన ధరలకు బియ్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి’ అని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు రైస్‌ మిల్లర్లు, హోల్‌సేల్‌, రిటైల్‌ వ్యాపారులను ఆదేశించారు. మంగళవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని శంకరన్‌ హాల్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. బీపీటీ 3291, బీపీటీ 5204, కేఎన్‌ఎం రకాల బియ్యం కిలో రూ.66, హెచ్‌ఎంటీ, ఆర్‌ఎన్‌ఆర్‌ రకాలు రూ.76, జైశ్రీరామ్‌ రకం రూ.82, ఎంటీయూ సాధారణ రకం రూ.47 చొప్పున విక్రయించాలని సూచించారు. నిర్ణీత ధరలకు మించి విక్రయాలు జరగకుండా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రతి రైస్‌ మిల్లర్‌, వ్యాపారి తమ వద్ద ఉన్న నిల్వల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ ఫుడ్‌ స్టాక్‌ పోర్టల్లో ఈ నెల 13వ తేదీలోగా వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. నిల్వల వివరాలను బాస్మతి బియ్యం, నాన్‌ బాస్మతి ప్రీమియం బియ్యం, సాధారణ రకం బియ్యం, ఉప్పుడు బియ్యం, నూకలు, వరి ధాన్యం.. ఇలా ఆరు కేటగిరీలుగా విభజించి నమోదు చేయాలని సూచించారు. కొనుగోళ్లు, అమ్మకాలు, మిల్లింగ్‌, ఇతర లావాదేవీల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని తెలిపారు. నిల్వల నమోదు విషయంలో నిర్లక్ష్యం వహించకుండా ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని జేసీ స్పష్టం చేశారు.

నిందితుడి

ఆచూకీ కోసం గాలింపు

వెంకటాచలం: ఐదేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడి ఆచూకీ కోసం వెంకటాచలం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. మండలంలోని తిక్కవరప్పాడు పంచాయతీ కండ్రిగ హరిజనవాడకు చెందిన సుబ్బరామయ్య ఆదివారం బాలికపై అఘాయిత్యానికి పాల్పడి పరారైన విషయం తెలిసిందే. అతడి ఆచూకీ కోసం పోలీసులు వెంకటాచలం, నెల్లూరు నగరంతోపాటు అతని బంధువులు నివసించే గ్రామాలకు వెళ్లి ఆరా తీస్తున్నారు.

పొదలకూరు

నిమ్మ ధరలు (కిలో)

పెద్దవి : రూ.70

సన్నవి : రూ.40

పండ్లు : రూ.15

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement