ప్రభుత్వంపై ఆశ వర్కర్ల కన్నెర్ర | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వంపై ఆశ వర్కర్ల కన్నెర్ర

Nov 11 2026 12:25 AM | Updated on Nov 11 2026 12:25 AM

● సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

● డీఎంహెచ్‌ఓ కార్యాలయం ఎదుట ధర్నా

నెల్లూరు(బృందావనం): కూటమి ప్రభుత్వ తీరుపై ఆశ వర్కర్లు కన్నెర్ర చేశారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ నెల్లూరులోని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి కార్యాలయం ఎదుట మంగళవారం ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ సుజాతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ యూనియన్‌ జిల్లా కార్యదర్శి దుగ్గిరాల అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ ఎన్‌ఎల్‌ఈపీ సర్వే ఆన్‌లైన్‌లో ఏబీహెచ్‌ఏ ఐడీలు ఆశ వర్కర్లతో కాకుండా గతంలోలా ఏఎన్‌ఎంలతో చేయించాలన్నారు. అందుకు ఆశ వర్కర్ల సహకారం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వైద్యారోగ్య శాఖ కమిషనర్‌ ఎల్‌సీడీసీ సర్వేలో ఓటీపీ విధానం మార్పు చేస్తూ స్కిప్‌ ఆప్షన్‌ కల్పించే విధంగా టెక్నికల్‌ టీమ్‌కు ఆదేశాలు జారీ చేశారన్నారు. వాటిని క్షేత్రస్థాయి అధికారులకు పంపిస్తామని తెలిపారన్నారు. అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆశాలను కచ్చితంగా ఓటీపీ విధానం చేయాలని అధికారులు ఒత్తిడి చేయడం సరికాదన్నారు. అధికారపరంగా రికార్డుల కోసం జీఓలు వచ్చినప్పటికీ కింది స్థాయి అధికారులు రకరకాల రికార్డులు పెట్టాలంటూ వేధిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల మహిమలూరు ప్రాధమిక ఆరోగ్యకేంద్రం అధికారులు 34 రికార్డులు పెట్టమని సర్క్యులర్‌ ఇవ్వడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు.

టార్గెట్‌ పేరుతో..

క్షయవ్యాధి పరీక్షలకు సంబంధించి ఆశ వర్కర్లకు టార్గెట్‌ పేరుతో ప్రతినెలా ఐదుగురు టీబీ వ్యాధిగ్రస్తులను తీసుకురావాలంటూ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని అన్నపూర్ణమ్మ అన్నారు. ఈ సమస్యను అధికారి డాక్టర్‌ ఖాదర్‌వలీ దృష్టికి తీసుకెళ్లగా వెహికల్‌ వచ్చినప్పుడు తీసుకురమ్మని ఆశావర్కర్లకు చెప్పారన్నారు. అయితే కార్యాచరణలో మాత్రం అది కనిపించడం లేదన్నారు. అర్బన్‌ ప్రాంతంలో మూడు సంవత్సరాలుగా యూనిఫాం అందజేయలేదన్నారు. తక్షణమే ఇవ్వాలని డిమాండ్‌చేశారు. ఆశ వర్కర్లు తమ పరిధిలో జనాభా ఎక్కువగా ఉండటంతో వివరాలు సేకరించడంలో ఒత్తిడికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే చొరవ తీసుకొని మ్యాపింగ్‌ చేయాలన్నారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దశలవారీ ఆందోళకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రసేన, లత, స్వర్ణ, సుజాత, పద్మ, సుభాషిణి, మాబ్జాన్‌, అనిత, చందన తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement