ఉపాధి పనులకు వెళ్తూ.. మృత్యుఒడికి.. | - | Sakshi
Sakshi News home page

ఉపాధి పనులకు వెళ్తూ.. మృత్యుఒడికి..

Nov 11 2026 12:25 AM | Updated on Nov 11 2026 12:25 AM

● రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం

● 565 జాతీయ రహదారిపై ఘటన

వరికుంటపాడు: కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు ఉపాధి హామీ పనులకు వెళ్తున్న ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. మరో మహిళ తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని జడదేవి సమీపంలో 565 జాతీయ రహదారిపై మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కొందరు మహిళలు ఉపాధి హామీ పనులకు కాలినడకన వెళ్తుండగా గుర్తుతెలియని ద్విచక్ర వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అల్లూరి సీతమ్మ (36), భారతమ్మ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108 వాహనంలో వారిని ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సీతమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు. భారతమ్మకు చేయి విరిగింది. ఈ ఘటనపై వరికుంటపాడు ఎస్సై కె.మధుసూదన్‌రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరో ఘటనలో..

ఇదే జాతీయ రహదారిపై మంగళవారం మధ్యాహ్నం మరో ప్రమాదం జరిగింది. కాంచెరువు గ్రామానికి చెందిన కిషోర్‌ స్వగ్రామం నుంచి నెల్లూరుకు మోటార్‌బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ఘటనలో గాయపడిన అతడిని స్థానికులు 108 వాహనంలో ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తీసుకెళ్లారు. ఈ ఘటనపైనా ఎస్సై వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.

బెదిరించినా ధైర్యంగా ముందుకు..

● జగనన్నకు కానుకగా సైదాపురం జెడ్పీటీసీ విజయం

● వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి

వెంకటగిరి(సైదాపురం): వెంకటగిరి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నో ఆటంకాలు, ఒత్తిళ్లు, బెదిరింపులు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా పార్టీ కోసం ధైర్యంగా సైనికుల్లా పోరాడారని వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రాదేశిక ఎన్నికల్లో పార్టీ విజేతలు, అభ్యర్థులకు మంగళవారం సైదాపురంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ఆయన పేరు పేరునా అభినందించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ అరాచకాలకు ధైర్యంగా ఎదురొడ్డి నిలబడిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ప్రజలే ప్రశంసిస్తున్నారన్నారు. గెలుపోటములతో నిమిత్తం లేకుండా చివరిక్షణం వరకు పార్టీ కోసం పోరాడిన ప్రతి అభ్యర్థి, నాయకుడు, కార్యకర్తలకు కృషిని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. అందరి త్యాగాలు, కష్టం, నిబద్ధత ఎప్పటికీ వృథా కావని స్పష్టం చేశారు. ప్రజా సేవలో ముందుండాలని, జగనన్న బాటలో పయనించాలని నేతలకు చెప్పారు. ఈ పోరాటం ఇంతటితో ముగియలేదని, ఇది మరో విజయ ప్రస్థానానికి నాంది మాత్రమేనన్నారు. సైదాపురం, వెంకటగిరి ఎంపీపీ స్థానాలను కూడా సాధించబోతున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement