● బురదమయమైన రహదారిపై ఏరూరు వాసుల నిరసన
● వాహనాల అడ్డగింత
చిల్లకూరు: కూటమి ప్రభుత్వం రహదారుల బాగోగులను పట్టించుకోకపోవడంతో గ్రామీణ ప్రాంతవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు గ్రామాల ప్రజలు రోడ్లపైకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోరా? అని ప్రశ్నిస్తూ మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని ఏరూరు గ్రామానికి చెందిన స్థానికులు, బడికి వెళ్లే పిల్లలతో కలిసి రోడ్డుపై భారీ వాహనాలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాగరమాల రహదారి నిర్మాణంలో భాగంగా మండలంలోని 32 కిలోమీటర్ల ప్రధాన రహదారిపై భారీ వాహనాల రాకపోకలు సాగుతున్నాయన్నారు. పలు ప్రాంతాల్లో రోడ్డు పూర్తిగా దెబ్బతిందని చెప్పారు. ఏరూరులో సుమారు ఒకటిన్నర కిలోమీటరు మేర రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతోపాటు, చిన్నపాటి వర్షానికే బురదమయంగా మారుతోందని, నడవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం కురుస్తున్నా భారీ వాహనాల రాకపోకలను తగ్గించడం లేదన్నారు. దీంతో రోడ్డుపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడి, వర్షపు నీరు చేరి బురదమయంగా మారుతోందని తెలిపారు. పలుమార్లు వాహనాల రాకపోకలను అడ్డుకున్న సమయంలో రోడ్డు నిర్మాణ కాంట్రాక్ట్ సంస్థలైన ఏఎంఆర్, బీవీఎస్‌ఆర్ సంస్థల ప్రతినిధులు వచ్చి బాగు చేయిస్తామని హామీలు ఇచ్చి, ఆ తర్వాత పట్టించుకోవడం లేదని తెలిపారు. గ్రామస్తులు అడ్డుకోవడంతో సుమారు కిలోమీటర్ మేర భారీ వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డు బాగు చేసే వరకు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తామని స్పష్టం చేశారు. అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు త్వరగా రోడ్డును బాగు చేయకపోతే వాహనాలను కదలనివ్వబోమని హెచ్చరించారు.


