నెల్లూరు(క్రైమ్): నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ఈనెల 9వ తేదీ సోమవారం రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు నాకాబందీ నిర్వహించారు. ప్రధాన రహదారులు, జాతీయ రహదారులు, టోల్‌ప్లాజాలు, ముఖ్య కూడళ్ల వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారిపై ఏడు కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై మోటార్ వాహనాల చట్టం (ఎంవీ యాక్ట్) కింద 32 కేసులు నమోదు చేసి, రూ.18,820 జరిమానా విధించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న వారిపై 15 కేసులు నమోదు చేశారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు. మద్యం మత్తులో వాహనాలు నడిపినా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


