నెల్లూరు(పొగతోట): వీబీ జీ రామ్ జీ పథకం అమలులో భాగంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న డ్వామా సిబ్బంది ఉన్నతాధికారి ఒత్తిళ్లు తట్టుకోలేక సతమతమవుతున్నారు. నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలంటూ నిత్యం ఒత్తిడి తీసుకురావడం, లక్ష్యాలు చేరుకోకపోతే వేతనాల కోత, సస్పెన్షన్ హెచ్చరికలు జారీ చేస్తున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒత్తిళ్ల కారణంగా అనేకమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నెలలో ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లు (టీఏలు) మరణించగా, మరో ఇద్దరు పక్షవాతానికి గురైనట్లుగా చెబుతున్నారు. ఈ నెలలో ఇద్దరు క్షేత్రస్థాయి ఉద్యోగులు గుండెపోటుకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందినట్లు తెలిసింది.
పనులు పూర్తి కాకుండానే..
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కూలీలకు పనులు కల్పించడం, గ్రామ పంచాయతీల్లో పనులను గుర్తించడం, వాటిని కూలీలతో చేయించడం, పూర్తయిన పనులకు కొలతలు తీసి ఆన్లైన్లో వివరాలను నమోదు చేయడం వంటి బాధ్యతలను క్షేత్రస్థాయి సిబ్బంది నిర్వర్తించాల్సి ఉంటుంది. వీటితోపాటు ప్లాంటేషన్, గోకులాలు, హాస్టళ్లలో మొక్కలు నాటిన పనులకు బిల్లులు సమర్పించాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. పనులు పూర్తికాకుండానే బిల్లులు ఎలా సమర్పించాలని వారు ప్రశ్నిస్తున్నారు. కూలీలకు పనులు కల్పించి, వారిని పనులకు ఆహ్వానిస్తున్నామని.. అవసరమున్నవారు పనులకు వస్తున్నారని సిబ్బంది చెబుతున్నారు. అయితే అవసరం లేని వారిని బలవంతంగా పనులకు తీసుకురాలేమని పేర్కొంటున్నారు. పథకం అమలులో జిల్లా మొదటి స్థానంలో ఉండాలనే లక్ష్యంతో సదరు అధికారి ఒత్తిడి పెంచుతున్నారని, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 ఏళ్లుగా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నామని, ఇంతటి ఒత్తిడిని గతంలో ఎన్నడూ ఎదుర్కోలేదని కొందరు వాపోతున్నారు. రోజూ గంటల తరబడి జూమ్ సమావేశాలు నిర్వహిస్తూ లక్ష్యాలు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నిస్తున్నారని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇంటికి పంపిస్తామంటూ హెచ్చరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
వేతనాల్లో కోత
నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయలేదనే కారణంతో ఉన్నతాధికారి నోటీసులు జారీ చేయడం, వేతనాల్లో కోత విధించడం, సస్పెన్షన్ హెచ్చరికలు చేయడం జరుగుతోందని సిబ్బంది ఆరోపిస్తున్నారు. నోటీసులకు సమాధానంగా వివరణ ఇచ్చినా, లక్ష్యాలు పూర్తి చేసిన తర్వాతే వేతనాల చెల్లింపుపై నిర్ణయం తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఉద్యోగులు ఇచ్చిన వివరణ అధికారికి సంతృప్తికరంగా ఉంటేనే వేతనాలు చెల్లించాలని హెచ్ఆర్కు ఆదేశాలు ఇస్తున్నారని తెలిసింది. జూమ్ సమావేశాలకు ఎక్కడి నుంచైనా హాజరయ్యే అవకాశం ఉన్నప్పటికీ, తప్పనిసరిగా మండల కార్యాలయానికి రావాలని ఆదేశిస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో పనులు నిర్వహించడంతోపాటు కార్యాలయ సమావేశాలకు హాజరు కావడం ఇబ్బందిగా మారిందని వాపోతున్నారు. జిల్లా అధికారి ఇటీవల సెలవుపై విదేశాలకు వెళ్లిన సమయంలోనూ అక్కడి నుంచే జూమ్ సమావేశాలు నిర్వహించి, పనులపై ఆదేశాలు జారీ చేశారని సిబ్బంది వెల్లడిస్తున్నారు. నిరంతర పర్యవేక్షణ, లక్ష్యాల సాధనపై ఒత్తిడి కారణంగా విధులు నిర్వహించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డ్వామా కార్యాలయమే నివాసం
నీటియాజమాన్య సంస్థ (డ్వామా) జిల్లా అధికారిగా ఆరునెలల క్రితం బాధ్యతలు స్వీకరించిన ఆయన నగరంలో ప్రత్యేకంగా నివాసం ఏర్పాటు చేసుకోలేదు. కార్యాలయాన్నే నివాసంగా మార్చుకున్నారు. వారానికి ఒకటి రెండుసార్లు పక్క జిల్లాకు వెళ్లి వస్తున్నారని సమాచారం. ఇందుకు ప్రభుత్వ వాహనాన్ని వినియోగిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పని పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, లక్ష్యాల సాధనలో ఆచరణ సాధ్యమైన విధానాలను అమలు చేయాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఉన్నతాధికారి తీరుపై
విమర్శలు
లక్ష్యాల భారంతో సిబ్బంది సతమతం
పలువురికి గుండె సంబంధిత సమస్యలు
ఇద్దరు టీఏల మృతి
పక్షవాతానికి గురైన మరో ఇద్దరు టీఏలు


