కొండాపురం: మండలంలోని నేకునాంపేట టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి సన్మాన కార్యక్రమంలో మండలం విద్యాశాఖలో పనిచేస్తున్న సీఆర్పీ అయ్యన్న పాల్గొనడం చర్చనీయాంశమైంది. అయ్యన్న భార్య ఎం.చిన్నకృష్ణమ్మ ఎంపీటీసీగా పోటీ చేసి గెలిచారు. ఈమెకు వింజమూరులో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సన్మానం చేశారు. ఇందులో అయ్యన్న పాల్గొని శాలువా కప్పించుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి రాజకీయ పార్టీ కార్యక్రమంలో పాల్గొనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.
కాకుటూరులో గుర్తుతెలియని వ్యక్తి మృతి
వెంకటాచలం: మండలంలోని కాకుటూరు సమీపంలో పంట పొలాల వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని ఆదివారం గుర్తించారు. పోలీసుల కథనం మేరకు.. రైల్వే ట్రాక్, పంట పొలాల మధ్య సుమారు 45 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు చూశారు. వారి నుంచి సమాచారం అందుకున్న కాకుటూరు ఇన్‌చార్జి వీఆర్వో నాగేంద్రబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
పిచ్చికుక్కల స్వైరవిహారం
● 25 మందికి గాయాలు
పొదలకూరు: పట్టణంతోపాటు, తోడేరు, బిరదవోలు గ్రామాల్లో సోమవారం పిచ్చికుక్కలు చేసిన దాడిలో 25 మంది గాయపడ్డారు. కుక్కలను అదుపు చేయకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్‌కు సమీపంలో చికెన్ షాపుల వద్ద కుక్క స్వైరవిహారం చేసింది. ఆ ప్రాంతంలో సంచిరించే వారిపై దాడికి పాల్పడి గాయపరిచింది. కుక్క కాటుకు గురైన బాధితులు వెంటనే తేరుకుని, గంటల వ్యవధిలోనే స్థానిక ప్రభుతాస్పత్రికి చేరుకుని యాంటీ రేబిస్ టీకాలు చేయించుకున్నారు. ఆందోళన చెందిన పట్టణ వాసులు వెంటనే పిచ్చికుక్కను అదుపు చేయాల్సిందిగా పంచాయతీ నిర్వాహకులకు సమాచారం అందించారు. మండలంలోని తోడేరు, బిరదవోలు గ్రామాల్లో పిచ్చికుక్కల కాటుకు గురైన మరో 20 మంది స్థానిక సీహెచ్‌సీలో యాంటీ రేబీస్ ఇంజెక్షన్లను వేయించుకున్నారు.
పట్టాలు దాటుతూ..
● రైలు ఢీకొని వృద్ధుడి మృతి
కోవూరు: పడుగుపాడు – కొడవలూరు రైల్వే స్టేషన్ల మధ్య కిలోమీటర్ నంబర్ 183/30 – 32 వద్ద శనివారం రాత్రి పట్టాలు దాటుతూ రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. అతని వయసు 60 నుంచి 65 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న రైల్వే హెడ్ కానిస్టేబుల్ సీహెచ్ శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి కుడివైపు డయాలసిస్ చికిత్స నిమిత్తం అమర్చిన రెండు పైపులు ఉన్నట్లు గుర్తించారు. అయితే అతడి పూర్తి వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.


