రాపూరు: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో పెనుశిల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం అత్యంత వైభవంగా రథోత్సవం జరిగింది. ఉదయం వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలంకార మండపంలో నరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మిల ఉత్సవ విగ్రహాలను కొలువుదీర్చారు. స్వామి, అమ్మవార్లను శ్రీకృష్ణుడు, సత్యభామగా వివిధ పుష్పాలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించి రథంలో కొలువుదీర్చారు. కోనలో క్షేత్రోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఏడాదిలో బ్రహోత్సవాల్లో ఒకసారి స్వామికి రథంపై క్షేత్రోత్సవం జరుగుతుంది. దీపావళి సందర్భంగా రెండో పర్యాయం రథోత్సవం నిర్వహిస్తారు. ఉత్సవం ఆర్టీసీ బస్టాండ్ వరకు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన నరకాసుని బొమ్మను స్వామి విల్లుతో దహనం చేశారు.


