నెల్లూరు(టౌన్): జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ – 15 బాలికల జిల్లా స్థాయి ఎంపికలు మంగళవారం సాయంత్రం 3 గంటలకు నెల్లూరులోని ఏబీఎం గర్ల్స్ హైస్కూల్లో నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ఉమెన్స్ ఇన్‌చార్జి పి.డెలీలా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారిణులు పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలను తీసుకురావాలని సూచించారు. ఎంపికై న వారు ఈనెల 14, 15 తేదీల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో నిర్వహించే టోర్నమెంట్‌లో పాల్గొంటారని, అక్కడ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు.
పాముకాటుకు వ్యక్తి బలి
వెంకటాచలం: పాముకాటుకు గురై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని వెంకటాచలం పంచాయతీ జగనన్న కాలనీలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కాలనీకి చెందిన కిల్లా బాలాజీ శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో పని నిమిత్తం వెంకటాచలం సెంటర్‌కు వెళ్లాడు. తిరిగి రాత్రి 7:30 గంటలకు ఇంటికి వెళ్తుండగా పాముకాటుకు గురయ్యాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో వెంటనే స్థానిక క్లస్టర్ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆదివారం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడి భార్య అంకమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
గుర్తుతెలియని
వ్యక్తి ఆత్మహత్య
నెల్లూరు(క్రైమ్): బెంగుళూరు ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరు విజయమహాల్ గేటు సమీపంలో చైన్నె వైపు వెళ్లే పట్టాలపై ఆదివారం చోటు చేసుకుంది. మృతుడి వయసు 55 నుంచి 60 సంవత్సరాల్లోపు ఉంటుందని భావిస్తున్నారు. పచ్చ, నలుపు, తెలుపు రంగుల చెక్స్ ఫుల్‌హ్యాండ్స్ చొక్కా, పచ్చ, వంగపూత రంగుల గళ్ల లుంగీ ధరించి ఉన్నాడు. సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు రైల్వే పోలీస్‌స్టేషన్‌లో తెలియజేయాలని ఎస్సై కోరారు.
ఘాట్ రోడ్డులో డివైడర్‌ను ఢీకొన్న కారు
● త్రుటిలో తప్పిన ప్రమాదం
సీతారామపురం: మండలంలోని సీతారామపురం – పోరుమామిళ్ల ఘాట్ రోడ్డులో ఆదివారం కారు ప్రమాదానికి గురైంది. మొదటి మలుపు వద్ద అదుపుతప్పిన కారు డివైడర్‌ను బలంగా ఢీకొని ఆగడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల కథనం మేరకు.. మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లి గ్రామానికి చెందిన వంశీ, బాలాజీ, హరీష్‌లు కారులో భైరవకోనకు వెళ్లారు. తిరిగి వస్తుండగా ఘాట్ రోడ్డులోని మొదటి మలుపు వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. అదే సమయంలో కారు లోయలోకి దూసుకెళ్లి ఉంటే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేది. ఈ ఘటనలో కారు ముందు భాగం పాక్షికంగా దెబ్బతినగా, వంశీ స్వల్పంగా గాయపడ్డారు. అతడిని సీతారామపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు.
పేలిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్
గూడూరు: పట్టణంలోని దూర్జ టినగర్‌లో ఆదివారం రాత్రి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భారీ శబ్దంతో పేలిపోయి దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఒక్కసారిగా వినిపించిన శబ్దానికి ఉలికిపడిన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై గూడూరు ఒకటో పట్టణ విద్యుత్ శాఖ ఏఈ స్పందించారు. ట్రాన్స్‌ఫార్మర్ పరిసర ప్రాంతాల్లో ఎండుగడ్డి ఎక్కువగా ఉందన్నారు. దీపావళి సందర్భంగా టపాసులు కాల్చడంతో వాటి నిప్పురవ్వలు ఎండుగడ్డిపై పడి మంటలు వ్యాపించాయని తెలిపారు. ఆ మంటల తీవ్రతకు ట్రాన్స్‌ఫార్మర్ కూడా కాలిపోయిందని, అక్కడ కాలిన టపాసుల ఆనవాళ్లను గుర్తించామని వివరించారు. విద్యుత్, అగ్నిమాపక శాఖల సిబ్బంది సమన్వయంతో వెంటనే మంటలను అదుపు చేశామని చెప్పారు. అనంతరం రెండు గంటల్లోనే మరో ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామన్నారు.


