● ప్రాణహాని ఉందంటూ బాధితుడి ఆవేదన
తోటపల్లిగూడూరు: దళితుడనైన తాను జనరల్ ఎంపీటీసీ స్థానంలో పోటీ చేశాననే అక్కసుతో టీడీపీ నాయకులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని రావూరువారికండ్రిగకు చెందిన ఉండ్రాళ్ల శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం స్థానికంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా వరిగొండ ఎంపీటీసీ జనరల్ సెగ్మెంట్‌లో నామినేషన్ వేసినందుకు టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారన్నారు. 5వ తేదీ జరిగిన ఎన్నికల్లో తమ ఏజెంట్ల ఫారాలను టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి భర్త జానా శ్రీనివాసులు చించివేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు. రిటర్నింగ్ అధికారికి చెప్పినా పట్టించుకోలేదదన్నారు. ఎన్నికలు సజావుగా జరిపించాల్సిన వారు అధికార పార్టీకి దాసోహమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుడు తమతో పోటీ చేయకూడనే ఆక్రోశంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీలుగా గెలిచిన అభ్యర్థులు, టీడీపీ నాయకులు అర్ధరాత్రి తమ ఇంటిముందు బాణసంచా కాల్చి భయాందోళనకు గురిచేశారన్నారు. ఎలాగైనా తనను అంతం చేయాలని చూస్తున్నారని, రక్షణ కల్పించాలని కోరారు. తనకు ఏదైనా జరిగితే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి బాధ్యత వహించాలని పేర్కొన్నారు.


