● సీనియర్ సివిల్ జడ్జి పద్మశ్రీ
నెల్లూరు(లీగల్): న్యాయసేవల ప్రాముఖ్యతపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వైజే పద్మశ్రీ అన్నారు ఉచిత న్యాయ సహాయం, ప్రజల హక్కులపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన జాతీయ న్యాయ సేవల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నెల్లూరులోని జిల్లా కోర్టు ప్రాంగణంలో సోమవారం ఆమె జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ 1987 నవంబర్ 9న న్యాయ సేవ అధికార చట్టాన్ని రూపొందించి దేశవ్యాప్తంగా సంస్థను ఏర్పాటు చేశారన్నారు. నిర్దిష్టమైన ప్రణాళికతో చట్టాన్ని రూపొందించారని తెలిపారు. రాష్ట్ర హైకోర్టు, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.నరసింహమూర్తి ఆదేశాల మేరకు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కోర్టు నుంచి ప్రారంభమైన ర్యాలీ మార్కెట్, ఆర్టీసీ బస్టాండ్ వరకు సాగింది. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యప్పరెడ్డి, లోక్ అదాలత్ చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ టి.గోపాల్‌రెడ్డి, లోక్ అదాలత్ కార్యాలయ ఉద్యోగాలు సుమతి, లీలమ్మ, రజనీ, ప్యానెల్ న్యాయవాదులు పాల్గొన్నారు.


