నిర్లిప్తత.. ప్రేక్షకపాత్ర | - | Sakshi
Sakshi News home page

నిర్లిప్తత.. ప్రేక్షకపాత్ర

Nov 10 2026 12:19 AM | Updated on Nov 10 2026 12:19 AM

పీకేపాడులో వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలిచినట్లు బోర్డులో చూపారిలా..

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యాన్ని అధికార వ్యవస్థలు అపహాస్యం చేశాయి. నామినేషన్ల నుంచి కౌంటింగ్‌ పర్వం ఈ రెండు వ్యవస్థలు అడుగడుగునా అధికార పార్టీకి కొమ్ముకాస్తూ.. రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయి. టీడీపీ నేతలు కాలకేయులను మించిపోయి.. సాగించిన దాష్టీకాలను అడ్డుకోవాల్సిన ఖాకీ వ్యవస్థ, ప్రజాతీర్పును నిష్పక్షపాతంగా వెల్లడించాల్సిన రిటర్నింగ్‌ అధికారులు తారుమారు చేసి వ్యవస్థల ప్రతిష్టను పాతాళానికి దిగజార్చారు. ఎన్నికల ప్రజాక్షేత్రంలో ఓటమి తప్పదని భావించిన అధికార దశ కుట్రలకు తెర తీసింది. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు బరిలోకి దిగకుండా పచ్చమూకలు బెదిరించాయి. అయినా అదరకపోవడంతో ఖాకీలను రంగంలోకి దింపి వార్నింగ్‌ ఇప్పించారు. అప్పటికి బెదరక నామినేషన్లు వేసేందుకు వెళ్తే పచ్చతోడేళ్లు వెంటాయి. పత్రాలు లాక్కొని చించివేశాయి. కొన్ని చోట్ల కర్రలు, రాడ్లతో దాడులకు తెగబడ్డారు. అరాచకాలను ఎదురొడ్డి నామినేషన్లు వేస్తే.. మళ్లీ పోలీసులతో బెదిరింపులకు దిగారు. వెనక్కి తగ్గకపోవడంతో పచ్చచొక్కాలు ధరించిన కొందరు రిటర్నింగ్‌ అధికారులు పరిశీలనలో తిరస్కరించారు. అధికార పార్టీ నేతల ఆగడాలను.. అధికారులు దాష్టీకాలను ఎదురొడ్డి ప్రజాక్షేత్రంలో పోరాడి గెలిస్తే.. రీకౌంటింగ్‌ పేరుతో ఓట్లను తారుమారు చేసి, నోటా ఓట్లను కలిసి అధికార పార్టీ అభ్యర్థులు గెలుపొందినట్లు డిక్లరేషన్లు ఇచ్చి అమానవీయంగా వ్యవహరించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలిచిన చోట్ల డిక్లరేషన్లు ఇస్తే.. పచ్చతోడేళ్లు చించేసి.. ప్రజా తీర్పును నిస్సిగ్గుగా మార్చేశారు. పచ్చకాలకేయులను కట్టడి చేయాల్సిన ఖాకీలు అధికార పార్టీ పెద్దలు చెప్పారని అడ్డగోలుగా కౌంటింగ్‌ కేంద్రాల్లోని వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు నెట్టేసి.. అక్రమాలకు తెగబడాలని ఆర్వోలపై ఒత్తిడి చేశారు.

ప్రతి కన్నీటి బొట్టుకు తప్పదు భారీ మూల్యం

జిల్లాలో చిల్లకూరు, గూడూరు, అనంతసాగరం, జలదంకి, కావలి ఆర్వోలతోపాటు గూడూరు, కావలి, ఆత్మకూరు ఆర్డీఓలు, ఆత్మకూరు సీఐ, గూడూరు, కావలి డీఎస్పీలు ప్రజాస్వామ్య ఖూనీ కోరులుగా మిగిలారు. గెలిచిన ప్రతి అభ్యర్థి కార్చిన కన్నీటి బొట్టుకు భవిష్యత్‌లో న్యాయస్థానాల సాక్షిగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదనే విషయాన్ని మరిచిపోయారు. ఐదేళ్లు ఉండిపోయే అధికార పార్టీ నేతలు చెప్పారని అడ్డగోలుగా వ్యవహరించి ప్రజాతీర్పును అవమానించారు. మానవత్వాన్ని మరిచి.. అమానవీయంగా ప్రవర్తించారు.

u చిల్లకూరు మండలం తమ్మినపట్నంలో బొమ్మి సుజాతమ్మ ఏడు ఓట్ల మెజారిటీతో గెలిచినప్పటికీ, రీకౌంటింగ్‌ పేరుతో ఓట్లను తారుమారు చేసి ఒక్క ఓటుతో ఓడిపోయినట్లు ప్రకటించారు. తనకు జరిగిన అన్యాయంపై వర్షంలోనే బోరున విలపిస్తూ న్యాయం చేయాలని కోరితే.. పోలీసులు అత్యంత అమానుషంగా వ్యవహరించి బురదలో ఈడ్చుకెళ్లారు.

u జలదంకి బిట్‌–2 ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సురే పద్మావతి 17 ఓట్లతో గెలుపొందితే.. దాదాపు ఐదు గంటల పాటు ఫలితాన్ని వెల్లడించకుండా పక్కన పెట్టేసి.. ఏజెంట్లను తరిమేసి.. రాత్రి వరకు కాలయాపన చేశారు. చివరకు ఓట్లను తారుమారు చేసినా.. ఫలితం దక్కకపోవడంతో నోటా ఓటు వేసి టీడీపీ గెలిచినట్లు ప్రకటించారు. అక్కడి రిటర్నింగ్‌ అధికారితోపాటు కావలి డీఎస్పీ దాష్టీకానికి మనస్తాపం చెందిన అభ్యర్థి భర్త వెంకట శేషారెడ్డి రెండంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ దంపతులు అధికారుల తీరుపై దుమ్మెత్తి పోశారు. కన్నీరుమున్నీరుగా రోదిస్తున్న తీరును అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేస్తే.. కరుడుగట్టిన రాతి గుండెలు మాత్రం ఏ మాత్రం చలించకపోగా.. వారిని అక్కడి నుంచి బయటకు వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేయడం రాక్షసత్వానికి పరాకాష్టగా నిలిచింది.

u అనంతసాగరం అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి అయితే ఏకంగా ప్రజాతీర్పును అవమానించారు. పీకేపాడు సెంగ్మెంట్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి 942 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థికి 899 ఓట్లు వచ్చాయి. 43 ఓట్లతో వైఎస్సార్‌సీపీ గెలిస్తే.. ఇక్కడ రీకౌంటింగ్‌ పేరుతో ఓట్లు తారుమారు చేసి టీడీపీ అభ్యర్థి గెలిచినట్లు డిక్లరేషన్‌ ఇచ్చారు.

u అనంతసాగరం జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అమరావతి 1000 ఓట్లకుపైగా మెజార్టీతో గెలుపొందారు. ఫలితాన్ని ప్రకటించకుండా పక్కన పెట్టి.. చివరకు 979 ఓట్లు చెల్లనివిగా ప్రకటించి టీడీపీ అభ్యర్థి మెట్టుకూరు శిరీషా 392 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ప్రకటించారు.

u సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలంలో కౌంటింగ్‌ అక్రమాలకు అంతే లేదు. ప్రతి రౌండ్‌లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో నమోదు చేసి, అన్ని పార్టీల ఏజెంట్ల సంతకాలు తీసుకోవాల్సి ఉండగా, ఆ నిబంధనలను పట్టించుకోలేదు. ఎనిమిది ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించిన తర్వాత మిగిలిన స్థానాల కౌంటింగ్‌లో గందరగోళం సృష్టించారు. దొరువులపాళెం ఎంపీటీసీ స్థానంలో మూడు రౌండ్లలో వైఎస్సార్‌సీపీ ఆధిక్యంలో ఉన్నా, చివరి రౌండ్‌లో ఫలితాన్ని తారుమారు చేసేందుకు కౌంటింగ్‌ ఏజెంట్లను బయటకు పంపించి, ఓట్ల కట్టలను మార్చి, నోటా ఓట్లను ఇతర లెక్కల్లో కలిపి ఫలితాన్ని మార్చారు.

u పొదలకూరు జెడ్పీటీసీ కౌంటింగ్‌లో ప్రతి రౌండ్‌ ఓట్ల వివరాలు, ఏజెంట్ల సంతకాలు లేకుండానే చివర్లో లెక్కలు ప్రకటించి 46 ఓట్ల మెజారిటీతో టీడీపీ గెలిచినట్లు ప్రకటించారన్నారు.

u గూడూరు మండలం తిప్పవరప్పాడు సెగ్మెంట్‌లో 20 ఓట్లతో వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయం సాధించినట్లు అధికారులు డిక్లరేషన్‌ ఇచ్చారు. గెలుపు పత్రాన్ని లాక్కొని టీడీపీ మూకులు చించేసి.. ఆర్వోను బెదిరించి.. 3 ఓట్లతో టీడీపీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించుకున్నారు. ఈ దాష్టీకానికి గూడూరు డీఎస్పీ సహా స్థానిక పోలీస్‌ అధికారులు అధికార పార్టీకి కొమ్ముకాశారు.

ప్రజాతీర్పును తారుమారు చేసిన

నియంతలు

నామినేషన్ల నుంచి కౌంటింగ్‌ వరకు అక్రమాలకు అండదండలు

మండల రిటర్నింగ్‌ ఆఫీసర్ల నుంచి జిల్లా రిటర్నింగ్‌ అధికారి వరకు..

ఎస్సైల నుంచి డీఎస్పీల వరకు

పచ్చ తోడేళ్లుగా మారిన వైనం

గెలిచి ఓడిన ప్రతి అభ్యర్థి కన్నీటి బొట్టుకు మూల్యం చెల్లించుకోక తప్పదు

గూడూరు నియోజకవర్గ కౌంటింగ్‌ ఇన్‌చార్జి, డీపీఓ వెంకటరామన్‌.. కౌంటింగ్‌ కేంద్రంలో ఆర్వో సాక్షిగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు, విజయం సాధించిన వారిపై అధికార పార్టీ నేతలు, రౌడీషీటర్లు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడినా చేష్టలుడిగి చూశారు. పర్యవేక్షించాల్సిన ఆయన చేతులెత్తేయడంతో ఎవరికి వారు తమ ఇష్టానుసారంగా ప్రవర్తించారు. అధికార పార్టీ అభ్యర్థులు ఓటమి పాలైనా వారే విజేతలని ప్రకటించారు. కౌంటింగ్‌ కేంద్రంలోకి దాదాపు 30 మంది రౌడీషీటర్లు ప్రవేశించి నానా బీభత్సాన్ని సృష్టించినా, డీఎస్పీ ఏ మాత్రం అడ్డుకోలేదు. విజయం సాధించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు డిక్లరేషన్‌ ఫారాలను ఇవ్వకుండా.. టీడీపీ వారు గెలుపొందారని ప్రకటించేందుకు కీలకంగా వ్యవహరించారు.

చిల్లకూరు మండలం తమ్మినపట్నం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఏడు ఓట్లతో గెలుపొందారు. అయితే రీకౌంటింగ్‌ పేరుతో డ్రామాకు తెరలేపి అధికార పార్టీ అభ్యర్థి విజయం సాధించారని ప్రకటించారు.

గూడూరు మండలం తిప్పవరప్పాడు సెగ్మెంట్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి 22 ఓట్లతో గెలిచారు. విషయం తెలుసుకున్న అధికార పార్టీకి చెందిన రౌడీషీటర్లు దాడులకు పాల్పడ్డారు. అయితే అభ్యర్థిని బయటకు గెంటేయించి టీడీపీ గెలిచినట్లు ప్రకటించారు. ఈ విషయం తెలిసినా ఇన్‌చార్జి అధికారి ప్రశ్నించిన దాఖలాల్లేవు. కౌంటింగ్‌ జరుగుతున్న సమయంలో అధికార పార్టీ ఏజెంట్‌ బ్యాలెట్‌ కట్టను బయటకు తీసుకొచ్చేందుకు యత్నించినా, ఎలాంటి చర్యల్లేవు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గూడూరు జెడ్పీటీసీ అభ్యర్థి కొట్టు సురేష్‌కు 2500 ఓట్ల మెజార్టీ వచ్చినా, రీకౌంటింగ్‌ చేసి ఓటమి పాలైనట్లు ప్రకటించారు.

సైదాపురం జెడ్పీటీసీ అభ్యర్థికి 1200 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇంకా రెండు వేల ఓట్ల వరకు లెక్కించాల్సి ఉండగా, కేంద్రంలోకి వెంకటగిరి ఎమ్మెల్యే చేరుకొని ప్రక్రియను నిలిపేయాలని ఆదేశించారు. ఇలా అధికార పార్టీకి వెంకటరామన్‌ తొత్తులా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement