మంత్రి పదవి పోతుందనే ఆనం అరాచకాలు | - | Sakshi
Sakshi News home page

మంత్రి పదవి పోతుందనే ఆనం అరాచకాలు

Nov 10 2026 12:19 AM | Updated on Nov 10 2026 12:19 AM

నెల్లూరురూరల్‌: ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఖూనీ చేశారని ఆత్మకూరు సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరులోని మేకపాటి నివాసంలో ఆదివారం మీడియా సమావేశంలో మేకపాటి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాభిప్రాయం తమకు వ్యతిరేకంగా ఉందని గ్రహించిన కూటమి ప్రభుత్వం అక్రమాలు, దౌర్జన్యాలు, పోలీసుల సహకారంతో ఎన్నికల్లో గెలిచేందుకు కుట్రలు చేసిందన్నారు. ఆనం మంత్రి పదవి ఎక్కడ చేజారిపోతుందోనన్న భయంతోనే నామినేషన్ల ప్రక్రియ నుంచి పరిశీలన, పోలింగ్‌ వరకు అడుగడుగునా అడ్డగోలుగా వ్యవహరించారని విమర్శించారు. నామినేషన్ల నుంచి పోలింగ్‌ వరకు పోరాడి, ప్రజల మద్దతుతో ఓట్లు వేయించుకుంటే కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓడిపోయే సెగ్మెంట్లలోనూ అక్రమంగా గెలుపు ప్రకటించుకున్నారన్నారు. పోలింగ్‌ రోజు ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్న సమయంలో మంత్రి ఆనం కావాలనే గొడవలు సృష్టించే ప్రయత్నం చేశారన్నారు. తమను రెచ్చగొట్టి ఏదైనా ఘటన జరిగితే మంత్రి మీద దాడి చేశారంటూ కేసులు పెట్టించి వైఎస్సార్‌సీపీ నాయకులను అరెస్టు చేయించాలన్నది వారి వ్యూహమన్నారు. ఒక అభ్యర్థి ఫోన్‌ చేసి తనపై దాడికి వస్తున్నారని చెప్పడంతో తాను అక్కడికి వెళ్లానన్నారు. ఈ సమయంలో సీఐ గంగాధర్‌ అక్కడికి రావడం వెనుక ఉద్దేశం ఏమిటో తనకు అర్థమైందన్నారు. మంత్రి అక్కడ ఉండొచ్చని, తాను మాత్రం అక్కడ నిలబడటానికి వీల్లేదంట. ఒక చోట గొడవ సృష్టించి తమ నాయకులను అరెస్టు చేయించి, రిగ్గింగ్‌కు అవకాశం కల్పించాలన్నది వారి వ్యూహమన్నారు. తిక్కవరం నుంచి తమ పోలింగ్‌ ఏజెంట్లను బయటకు పంపిస్తున్నారని, అక్కడ అక్రమాలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో వెంటనే అక్కడికి బయలుదేరినట్లు తెలిపారు. అయితే మార్గమధ్యంలో సీఐ గంగాధర్‌ తనను అడ్డుకున్నారని చెప్పారు. ఎన్నికల నిబంధనల ప్రకారం తనకు ఉన్న హక్కుల మేరకు పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించేందుకు వెళ్తున్నానని స్పష్టం చేసినా పోలీసులు అనుమతించలేదన్నారు. పోలింగ్‌ కేంద్రం వద్ద ఎస్‌ఐ బలరామిరెడ్డి ఉండగా, తనను సీఐ అడ్డుకోవడం కచ్చితంగా అక్కడ రిగ్గింగ్‌ జరిగిందని, ఆ బూత్‌లో సుమారు 300 ఓట్లకు పైగా గంపగుత్తుగా టీడీపీ అభ్యర్థికి నమోదయ్యాయన్నారు. సమావేశంలో నియోజకవర్గ వైఎస్సార్సీపీ పరిశీలకులు పేర్నేటి కోటేశ్వరరెడ్డి, జిల్లా ఉ పాధ్యక్షుడు డాక్టర్‌ సీహెచ్‌ ఆదిశేషయ్య, రాష్ట్ర మున్సి పల్‌ విభాగ కార్యదర్శి అల్లారెడ్డి ఆనంద్‌ రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్‌ రెడ్డి, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి కొండా వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పీటీసీ పెమ్మసాని ప్రసన్నలక్ష్మి, లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు నందా ఓబులేసు, కంటాబత్తిన రఘునాథరెడ్డి, రాపూరు సుందరరామిరెడ్డి, ఎండీ ముజ్జు తదితరులు పాల్గొన్నారు.

అండర్‌ వరల్డ్‌ డాన్‌లను మించిపోయిన ఆనం

దావూద్‌, హాజీ మస్తాన్‌ వంటి అండర్‌ వరల్డ్‌ డాన్‌లు రాజ్యాధికారం చేతిలో లేక డాన్‌లుగా మిగిలిపోయారని, మంత్రి ఆనం మాత్రం అధికారాన్ని చేతిలో పెట్టుకుని డాన్‌లకే డాన్‌గా వ్యవహరిస్తున్నారని విక్రమ్‌రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. వ్యవస్థలన్నింటినీ తన రాజకీయ ప్రయోజనాల కోసం దారుణంగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. గతంలో ఇలాంటి అరాచకాలకు పాల్పడితే ఊరి శిక్ష విధించేవారని, ఇప్పుడు ఎలాంటి రాజకీయ శిక్ష విధించాలో ఆత్మకూరు ప్రజలే నిర్ణయిస్తారన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ప్రతి పరిణామానికి ఆధారాలు ఉన్నాయని, వీడియో దృశ్యాలు సైతం తమ వద్ద ఉన్నాయని, దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇలాంటివి చూసి కూటమిలో భాగస్వామ్యమైనందుకు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ హక్కులను కాలరాసి అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్న వారికి ప్రజలే తగిన సమాధానం చెబుతారని మేకపాటి విక్రమ్‌రెడ్డి హెచ్చరించారు.

పోలీసుల అండతో రిగ్గింగ్‌కు పాల్పడ్డారు

నామినేషన్ల నుంచి కౌంటింగ్‌ వరకు అడుగడుగునా అక్రమాలే

ఓడిపోయే స్థానాల్లోనూ అక్రమంగా గెలుపు ప్రకటించుకున్నారు

ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే

మేకపాటి విక్రమ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement